Joe Biden: బైడెన్‌ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి క్రెమ్లిన్‌పై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటికి దీటుగా మాస్కో కూడా ఆయా దేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తూ వస్తో్ంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు

Published : 29 Jun 2022 02:44 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి క్రెమ్లిన్‌పై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటికి దీటుగా మాస్కో కూడా ఆయా దేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు మంత్రులను రష్యాలోకి రాకుండా నిషేధం విధించగా.. తాజాగా బైడెన్‌ సతీమణి, కుమార్తెను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.

‘‘రష్యాకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులపై అమెరికా విధిస్తోన్న ఆంక్షలకు ప్రతిస్పందనగా.. మరో 25 మంది అమెరికన్‌ పౌరులను ‘స్టాప్‌ లిస్ట్‌’ జాబితాలో చేర్చాం’’ అని రష్యా వెల్లడించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌, ఆయన కుమార్తె ఆష్లే బైడెన్‌ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు పలువురు యూఎస్‌ సెనెటర్లు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, మాజీ ప్రభుత్వాధికారులపై రష్యా ఈ నిషేధాజ్ఞలు విధించింది.

రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా దన్నుగా నిలుస్తోంది. ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం చేస్తోంది. మరోవైపు రష్యాను నిలువరించేందుకు అనేక ఆంక్షలు విధిస్తోంది. దీంతో ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన మాస్కో కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. ఈ ఏడాది మే నెలలో అధ్యక్షుడు బైడెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, సీఐఏ చీఫ్‌ విలియమ్‌ బర్న్స్‌ సహా పలువురు ప్రముఖులు రష్యాలోకి రాకుండా నిషేధం విధించింది. అయితే ఈ ప్రయాణ నిషేధాలు పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం లాంఛనప్రాయ ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి.

ఇదిలా ఉండగా.. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రష్యా బంగారంపై నిషేధం విధించేందుకు యూకే, అమెరికా, కెనడా, జపాన్‌ సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్‌కు అధునాతన ఎయిర్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థను పంపించేందుకు అమెరికా ముందుకొచ్చింది. త్వరలోనే ఈ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా తాజా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని