Ukraine Crisis: కీవ్‌పై దాడుల్లో మా ప్రమేయం లేదు.. అది వారి పనే: రష్యా

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై బుధవారం జరిగిన క్షిపణి దాడుల్లో తమ ప్రమేయం లేదని రష్యా స్పష్టం చేసింది. ఇదంతా ఉక్రెయిన్‌, విదేశీ క్షిపణుల పనేనంటూ ఆరోపించింది. కీవ్‌ నగరంలోని లక్ష్యాలపై తాజాగా తాము ఒక్క దాడి కూడా చేపట్టలేదని రష్యా రక్షణ శాఖ గురువారం తెలిపింది.

Published : 25 Nov 2022 01:41 IST

మాస్కో: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌(Kyiv)పై బుధవారం జరిగిన క్షిపణి దాడుల్లో తమ ప్రమేయం లేదని రష్యా స్పష్టం చేసింది. ఇదంతా ఉక్రెయిన్‌, విదేశీ క్షిపణుల పనేనంటూ ఆరోపించింది. కీవ్‌ నగరంలోని స్థావరాలపై తాజాగా తాము ఒక్క దాడి కూడా చేపట్టలేదని రష్యా రక్షణ శాఖ గురువారం తెలిపింది. స్థానికంగా జరిగిన విధ్వంసానికి.. రాజధానిలోని నివాస ప్రాంతాల్లో మోహరించిన విదేశీ, ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థల క్షిపణులే కారణమని మాస్కో ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘రష్యా డిమాండ్లను నెరవేరిస్తే.. దేశ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఉక్రెయిన్‌ వద్ద ఆప్షన్లు ఉన్నాయి’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.

అయితే.. ఉక్రెయిన్‌ మిలిటరీ కమాండ్‌, దాంతో సంబంధం ఉన్న ఇంధన వసతులపై మాత్రం భారీ దాడులు చేసినట్లు మాస్కో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. బుధవారం కీవ్‌పై జరిగిన భారీ దాడుల్లో 17 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. రష్యన్‌ సేనల లక్షిత దాడులతో ఉక్రెయిన్‌లోని చాలావరకు ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్, నీటి సరఫరా లేకుండా పోయింది. కీవ్‌లో 70 శాతం ప్రాంతాల్లో కరెంటు లేదని మేయర్‌ విటాలి క్లిట్ష్కో తెలిపారు. మరోవైపు.. స్థానికంగా ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువకు పడిపోయాయి. ఈ శీతాకాలం ఉక్రెయిన్‌లో లక్షల మంది పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని