Putin: ఇతర దేశాలతో రష్యాను వేరు చేయడం అసాధ్యం: పుతిన్‌

కేవలం భారత్‌, చైనాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు పుష్కలంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు.

Published : 10 Jun 2022 19:53 IST

భారత్‌, చైనాలే కాకుండా ఇతరులకూ దగ్గరవుతామన్న అధ్యక్షుడు

మాస్కో: కేవలం భారత్‌, చైనాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు పుష్కలంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ తమ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొనే అవకాశం ఉందన్న ఆయన.. రష్యా వంటి దేశాన్ని ప్రపంచ దేశాలతో వేరు చేయడం అసాధ్యమని ఉద్ఘాటించారు. అక్కడి యువ పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడిన పుతిన్‌.. ప్రపంచం చాలా పెద్దది, వైవిధ్యమైనదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు పెంచుతున్న వేళ వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘మీరు కేవలం భారత్‌, చైనా దేశాలతో సంబంధాల గురించే మాట్లాడుతున్నారు. కేవలం ఆ రెండు దేశాలే కాదు.. లాటిన్‌ అమెరికా కూడా కావచ్చు. ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్న ఆఫ్రికాలో 150కోట్ల జనాభా ఉంది. ఆగ్నేయాసియా మాటేమిటి..?’ అంటూ యువ పారిశ్రామికవేత్తలతో వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది. ఇక పశ్చిమ దేశాలు ఆంక్షలు కొనసాగించడాన్ని ప్రస్తావించిన ఆయన.. రష్యా వంటి దేశాన్ని బాహ్య ప్రపంచంతో వేరు చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. తమ భూభాగాలను తిరిగి పొందడంతోపాటు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడమే రష్యా లక్ష్యమని పుతిన్‌ పేర్కొన్నారు. ఈ విలువలే మన ఉనికికి కీలకమనే వాస్తవాన్ని గ్రహించి ముందుకు సాగితే.. లక్ష్యాలను సాధించడంలో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక రష్యా నుంచి ఇంధన సరఫరాను నిలిపివేసి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని ఐరోపా దేశాలు పిలుపునివ్వడంపై స్పందించిన పుతిన్‌.. రానున్న కొన్ని సంవత్సరాల్లో రష్యా ఇంధన వనరులను వదులుకోవడం ప్రతి ఒక్కరికీ అసాధ్యమైన విషయమని అభిప్రాయపడ్డారు.

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన రష్యా దురాక్రమణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా దూకుడును అడ్డుకునేందుకు పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును నిరసిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అక్కడ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా సేనలు మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని