Published : 03 Jul 2022 18:38 IST

Ukraine Crisis: లుహాన్స్క్‌ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటోంది రష్యా. ఇందులో భాగంగానే లుహాన్స్క్‌ ప్రావిన్సును సైతం చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి ప్రధాన నగరాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధ్యక్షుడు పుతిన్‌కు వెల్లడించింది. ‘విజయవంతమైన సైనిక కార్యకలాపాల ఫలితంగా, రష్యన్ ఫెడరేషన్ సాయుధ దళాలు, పీపుల్స్ మిలీషియా యూనిట్లతో కలిసి లిసిచాన్స్క్ నగరంపై పూర్తి నియంత్రణను ఏర్పరచుకున్నాయి’ అని రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదివారం పుతిన్‌కు నివేదించినట్లు రష్యన్ వార్తా సంస్థలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌ సైన్యం గతంలో సివిరోడొనెట్స్క్‌ను కాపాడుకునేందుకు చేసిన పోరాటం మాదిరిగానే, లిసిచాన్స్క్‌ నగరాన్ని శత్రు సైన్యానికి దక్కనీయకుండా వీరోచితంగా పోరాడుతున్నాయి. తాజా ఆక్రమణతో కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌ సైన్యం అక్కడ చేస్తున్న పోరు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆక్రమణపై ఉక్రెయిన్‌ ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. అంతకుముందు లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ హైదై మాట్లాడుతూ.. ప్రావిన్స్‌లోని చివరి బలమైన నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు క్రెమ్లిన్‌ క్రూరమైన దాడులు చేస్తోందని, తమ సైన్యాన్ని కోల్పోతున్నా మొండిగా ముందుకు సాగుతున్నారని టెలిగ్రామ్‌ వేదికగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. సైనిక చర్య చేపట్టిన ఆరంభంలో నల్ల సముద్రంలోని ‘స్నేక్‌ ఐలాండ్‌’ను ఆక్రమించిన రష్యా.. ఇప్పుడు దాన్ని వదులుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. స్నేక్‌ ఐలాండ్ ద్వీపం నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే కీలకమైన ఉక్రెయిన్‌ తీర ప్రాంతాలు, రేవులు ఉండటంతో అక్కడి నుంచి ఆయా ప్రాంతాలపై సులువుగా దాడులు చేయొచ్చని భావించిన రష్యా ఆ తీరంపై ఆధిపత్యం చాటుకున్నాయి. కానీ ఉక్రెయిన్‌ సేనలు మాత్రం పట్టువదల్లేదు. స్నేక్‌ ద్వీపమే లక్ష్యంగా నాలుగు నెలలుగా దాడులు చేస్తూ వచ్చాయి. అక్కడికి రష్యా చేరవేస్తున్న భారీ ఆయుధాలపైనా, యుద్ధ సామగ్రితో తరలివెళ్తున్న నౌకలపైనా బాంబులతో తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆ ద్వీపాన్ని రష్యా విడిచిపెట్టి వెనకడుగు వేసింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని