Ukraine Crisis: యుద్ధం మొదటి 100 రోజులు.. రష్యా ఇంధన ఆదాయమెంతో తెలుసా!

రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. కీలకమైన చమురు, గ్యాస్‌ రంగాలనూ లక్ష్యంగా చేసుకున్నాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదటి 100 రోజుల్లో ఇంధన ఎగుమతులపై మాస్కో 97.50 బిలియన్‌ డాలర్ల ఆదాయం అర్జించింది...

Published : 14 Jun 2022 01:38 IST

ఈయూ దేశాలదే ప్రధాన వాటా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. కీలకమైన చమురు, గ్యాస్‌ రంగాలనూ లక్ష్యంగా చేసుకున్నాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదటి 100 రోజుల్లో ఇంధన ఎగుమతులపై మాస్కో 97.50 బిలియన్‌ డాలర్ల ఆదాయం అర్జించింది! దిగుమతుల్లో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) వాటానే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది 61 శాతంగా ఉంది. దీని విలువ దాదాపు 60 బిలియన్‌ డాలర్లు.  ఫిన్లాండ్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఏయిర్(సీఆర్‌ఈఏ) ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, దిగుమతుల్లో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ఒప్పందాలు కాకుండా స్పాట్ కొనుగోళ్లు ఉన్నాయని సీఆర్‌ఈఏ విశ్లేషకుడు లారీ మైల్లీవిర్టా చెప్పారు.

అతిపెద్ద దిగుమతిదారుగా చైనా మొదటిస్థానంలో నిలిచింది. ఇది 13.20 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ(12.68 బిలియన్ డాలర్లు), ఇటలీ(8.17 బిలియన్‌ డాలర్లు) నిలిచాయి. భారత్‌ 3.56 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోలు చేసింది. అయితే, రష్యా ఆదాయానికి పోలాండ్‌, అమెరికాలు భారీగా దెబ్బకొట్టాయి. లిథువేనియా, ఫిన్లాండ్, ఎస్తోనియా తదితర దేశాలు 50 శాతానికిపైగా రష్యన్‌ దిగుమతులను తగ్గించాయి. మరోవైపు.. క్రెమ్లిన్‌ ఇంధన ఎగుమతుల ఆదాయంలో అధిక శాతం క్రూడ్ ఆయిల్‌ నుంచి వచ్చింది. దీని విలువ దాదాపు 48.2 బిలియన్‌ డాలర్లు. ఆ తర్వాతి స్థానాల్లో పైప్‌లైన్ గ్యాస్, చమురు ఉత్పత్తులు, ద్రవీకృత సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ), బొగ్గు అమ్మకాలు ఉన్నాయి.

ఉక్రెయిన్‌పై దండయాత్ర కారణంగా అనేక దేశాలు రష్యా నుంచి దిగుమతులపై ఆంక్షలు విధించడంతో.. సైనిక చర్యకు ముందు సమయంతో పోల్చితే మే నెలలో దిగుమతులు 15 శాతం వరకు తగ్గాయి. దీనికితోడు రాయితీ ధరలకు సరఫరా చేయడంతో మే నెలలో రష్యాకు రోజుకు సుమారు 209 మిలియన్ డాలర్ల మేర ఆదాయానికి గండి పడింది. అయినప్పటికీ.. ఇంధన డిమాండ్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్లో పెరుగుదలతో క్రెమ్లిన్ ఖజానా నిండుతూనే ఉంది. ఎగుమతి ఆదాయాలు రికార్డు స్థాయికి చేరాయి. సీఆర్‌ఈఏ నివేదిక ప్రకారం.. రష్యా  సగటు ఎగుమతి ధరలు గత ఏడాది కన్నా 60 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఈ నెల ప్రారంభంలో.. రష్యా చమురు దిగుమతులను చాలావరకు నిలిపేసేందుకు ఈయూ అంగీకరించింది. ఈ ఏడాది గ్యాస్ రవాణాను మూడింట రెండొంతుల మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాస్కో ఆదాయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని