Ukraine Crisis: జర్మనీపై రష్యా ప్రతీకారం.. ఏం చేసిందో తెలుసా?

ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న జర్మనీపై రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లో మారణకాండను సృష్టిస్తోన్న రష్యాను.....

Published : 26 Apr 2022 01:49 IST

మాస్కో: ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న జర్మనీపై రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లో మారణకాండను సృష్టిస్తోన్న పుతిన్‌ సేనల్ని కట్టడి చేసేందుకు ఏప్రిల్‌ 4న.. రష్యాకు చెందిన 40మంది దౌత్య సిబ్బందిని బహిష్కరిస్తున్నట్టు జర్మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్‌ సర్కార్‌ సీరియస్‌గా స్పందించింది. జర్మనీలోని తమ అధికారులను బహిష్కరించడానికి ప్రతిస్పందనగా 40మంది జర్మన్‌ దౌత్య అధికారులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ జర్మన్‌ రాయబారికి సమన్లు పంపింది. తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించినందుకు ఇది తమ తీవ్ర నిరసనగా పేర్కొంది.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలోని బుచాలో బుచా పట్టణంలో మారణహోమంపై బయటకు వచ్చిన దృశ్యాలతో యావత్‌ ప్రపంచం కలతచెందిన విషయం తెలిసిందే. రష్యా సైన్యం సామాన్య పౌరుల చేతులు కట్టేసి, తలపై కాల్చి హతమార్చినట్లు ఆ దృశ్యాల ద్వారా అర్థమవుతోంది. అలాగే బుచా వీధుల్లో దాదాపు 400 శవాలు కనిపించగా.. ఆ మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు 45 అడగుల పొడవైన గుంతను తవ్వినట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. ఈ హింసాకాండను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించగా.. రష్యా దూకుడిని కట్టడి చేసేలా పలు కఠిన చర్యలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే జర్మనీ రష్యాకు చెందిన 40మంది దౌత్య సిబ్బందిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించగా.. అందుకు ప్రతి చర్యకు రష్యా కూడా అదే చర్యలు ప్రకటించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని