Published : 22 May 2022 02:06 IST

Russia: 963 మంది అమెరికన్లపై రష్యా నిషేధాజ్ఞలు.. జాబితాలో అధ్యక్షుడు బైడెన్‌

మాస్కో: ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం అందించడాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా కీలక అడుగులు వేస్తోంది. అమెరికా వాసులపై నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా 963 అమెరికన్లపై ప్రయాణ నిషేధం విధించినట్లు పుతిన్‌ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. గతంలోనే అధ్యక్షుడు బైడెన్‌, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌, సీఐఏ (CIA) చీఫ్‌ విలియమ్‌ బర్న్స్‌పై ప్రయాణ నిషేధం విధించినట్లు తెలిపింది. ఆ జాబితాలో మరికొందరి పేర్లు చేర్చడంతో మొత్తం సంఖ్య 963కు చేరినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌కు బైడెన్‌ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ప్రయాణ నిషేధాలు పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం లాంఛనప్రాయ ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి బాధిత దేశానికి అగ్రరాజ్యం అమెరికా దన్నుగా నిలుస్తోంది. ఆయుధాలు అందిస్తూ, ఆర్థికసాయం చేస్తోంది. తాజాగా మరోసారి ఆర్థికసాయానికి ముందుకొచ్చింది. బైడెన్‌ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి  సెనెట్‌ ఆమోదించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లును 86-11 ఓట్లతో పాస్‌ చేసింది. ఈ బిల్లు ప్రకారం సైనిక, మానవీయ సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందనుంది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేందుకు నిర్ణయించుకొన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సెనెట్‌ ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ కింద అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించే అవకాశం లభించింది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని