Ukraine Crisis: ఆధారాల నాశనానికి రష్యా కొత్త కుట్ర్ర.. మాస్కోకు ఇన్ఫీ గుడ్‌బై.. 10 పాయింట్లు

ఉక్రెయిన్‌పై గత 49 రోజులుగా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు వైపులా వేలాది మంది సైనికులు మృతిచెందగా.......

Updated : 13 Apr 2022 22:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉక్రెయిన్‌పై గత 49 రోజులుగా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు వైపులా వేలాది మంది సైనికులు మృతిచెందగా.. అంతులేని నష్టం సంభవించింది. రష్యా సేనలు తమ నగరాలపై తూటాలు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతుండగా.. ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తూ శత్రువుల్ని మట్టుబెడుతున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌పై పుతిన్‌ సేనలు కొనసాగిస్తున్న దండయాత్ర నేపథ్యంలో పలు అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. యుద్ధంతో తీవ్ర విధ్వంసానికి గురైన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి 10 కీలక పాయింట్లు..

  1. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంలోని మార్చురీ రిఫ్రిజిరేటర్లలో 1500లకు పైగా రష్యా సైనికుల మృతదేహాలు ఉన్నాయని, వాటిని ఇంతవరకు ఎవరూ తీసుకుపోలేదని ఆ నగర మేయర్‌ మిఖైల్‌ లెస్నెంకో తెలిపారు. రష్యన్‌ తల్లులు వచ్చి వారి కుమారుల మృతదేహాల్ని తీసుకెళ్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
  2. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యాకు అనేక అంతర్జాతీయ సంస్థలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. నిన్న నోకియా సంస్థ రష్యా విపణితో సంబంధాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కూడా రష్యా నుంచి తమ కార్యకలాపాలను తరలిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సలీల్‌ పరేఖ్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో సంక్షోభ వాతావరణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. 
  3. రష్యా బలగాల దాడుల్ని ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకు 19,800 మందికి పైగా శత్రు సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే, రష్యాకు చెందిన 158 విమానాలు, 143 హెలికాప్టర్లు, 739 ట్యాంకులు, 1964 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది. 
  4. ఉక్రెయిన్‌తో చర్చలు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నట్టు రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జెఖారొవా వెల్లడించారు.
  5. రష్యా తన సైన్యం అరాచకాలకు సంబంధించిన ఆధారాల్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. సైనిక చర్యలో మృతి చెందిన ఉక్రెయిన్‌ పౌరుల మృతదేహాలను రష్యా సైనికులు ఎక్కడికక్కడ దహనం చేసేందుకు మొబైల్‌ శ్మశానవాటికలను నిర్వహిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదికలు పేర్కొంటున్నాయి. మేరియుపోల్‌లో 13 మొబైల్‌ క్రిమిటోరియంలు పనిచేస్తున్నట్టు తెలిపింది.
  6. రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 191మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ వెల్లడించారు. అలాగే, 349 మంది చిన్నారులు గాయపడినట్టు తెలిపారు. ఏప్రిల్‌ 11న ఖర్కివ్‌లో రష్యా బలగాల దాడిలో నెలన్నర శిశువుతో పాటు 12 ఏళ్ల బాలుడు మృతిచెందగా.. ఖేర్సన్‌ ప్రాంతంలో జరిపిన దాడుల్లో కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 
  7. ఐరోపా దేశాల అధినేతలు ఉక్రెయిన్‌లో పర్యటించారు. పోలండ్‌, లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియా దేశాల అధినేతలు కీవ్‌ నగరంతో పాటు అక్కడికి 40కి.మీల దూరంలోని బోరోడియంక పట్టణాన్ని పరిశీలించారు. రష్యా బలగాల దాడులతో తీవ్ర విధ్వంసానికి గురైన ప్రదేశాలను పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడా, లిథువేనియా అధ్యక్షుడు గిటానాస్‌ నౌసెడా, లాత్వియా అధ్యక్షుడు ఎగిల్స్‌ లెవిట్స్‌, ఎస్తోనియా అధ్యక్షుడు అలార్‌ కరిస్‌ గమనించారు. ఈ పర్యటనలో భాగంగా వారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌ ప్రజలకు సాయం చేయడం, రష్యన్లతో  పోరాడేందుకు అవసరమైన ఆయుధ సాయంపై చర్చించే అవకాశం ఉంది. 
  8. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు రష్యా సేనలు కొనసాగిస్తున్న దండయాత్రలో ఉక్రెయిన్‌లో దాదాపు 100 సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలు ధ్వంసమైనట్టు యునెస్కో వెల్లడించింది. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు చాలా కాలం పాటు కొనసాగితే  మాత్రం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకొనేందుకు అనేక ఏళ్లు పడుతుందని రష్యా మాజీ ఆర్థిక మంత్రి ఒకరు తెలిపారు. 
  9. సుమీలో 100 మందికి పైగా పౌరుల్ని రష్యా బలగాలు చంపేసినట్టు ఆ ప్రాంత గవర్నర్‌ దిమిత్రో జెవిత్స్కీ వెల్లడించారు. ప్రజల చేతుల్ని కట్టేసి, వారిని చిత్ర హింసలకు గురిచేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయని, ఇంకొన్ని మృతదేహాలపై తలపై కాల్చినట్టు గుర్తులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 
  10. రష్యా కొనసాగిస్తున్న యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఈయూ మరోసారి  సాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైన్యం సమర్థతను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా దేశ ప్రజల రక్షణ కోసం అదనంగా 540 మిలియన్‌ డాలర్లు సాయంగా ఇస్తున్నట్టు ఐరోపా దేశాల మండలి  వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు అందించిన సాయం 1.6బిలియన్‌ డాలర్లకు చేరనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని