Russia: ఆ దేశాలు ఆదుకోకపోతే.. వచ్చే ఏడాదికి రష్యా వద్ద నగదు నిల్‌..!

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో పుతిన్‌ ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. వాటి ప్రభావం రష్యా(Russia) ఖజానాపై తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడి వ్యాపారవేత్త చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

Updated : 03 Mar 2023 15:59 IST

మాస్కో: ఉక్రెయిన్‌(Ukraine)పై దురాక్రమణ చేస్తోన్న రష్యా(Russia) వద్ద డబ్బులు నిండుకుంటాయట..! వచ్చే ఏడాదికి ఆ దేశ ఖజానా ఖాళీ అయిపోతుందట. మిత్ర దేశాల నుంచి పెట్టుబడులు వస్తేనే పుతిన్‌ ప్రభుత్వం ఈ గండాన్ని దాటుతుందని రష్యన్ ఒలిగార్క్‌ ఒలెజ్ డెరిపాస్కా(Oleg Deripaska) వెల్లడించారు. 

ఇంధన, లోహ రంగానికి చెందిన వ్యాపారవేత్త అయిన ఒలెజ్‌(Oleg Deripaska).. కొద్దికాలం క్రితం వరకు రష్యాలో అపరకుబేరుడిగా చలామణీ అయ్యారు. తాజాగా సైబీరియాలో జరిగిన పెట్టుబడుల సదస్సులో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఏడాదికి డబ్బు ఉండదు. ఇప్పటికే నిధులు కరిగిపోతున్నాయి. ఆ ప్రభావం మాపై కనిపిస్తోంది. మాకు విదేశీ పెట్టుబడులు అవసరం ఉంది’ అని తన దేశ పరిస్థితిని వివరించారు.

ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన దగ్గర నుంచి రష్యా(Russia)పై ఆంక్షల పర్వం మొదలైంది. అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్ యూనియన్.. పుతిన్ ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్నాయి. వాటి ప్రభావం అక్కడి వ్యాపారవేత్తలపై తీవ్రంగా పడింది. దాంతో వారు తమ వ్యాపారాలను ఇతర దేశాల్లోకి విస్తరించే పనుల్లో  ఉన్నారు.  ‘ఇంతకాలం మాది ఐరోపా దేశమని అనుకున్నాం. కానీ ఆసియాతో గతంలో మాకున్న సంబంధాల గురించి రానున్న 25 ఏళ్లు మేం ఆలోచించాలి’ అని ఒలెజ్ వ్యాఖ్యానించారు.

యూరోపియన్ రేటింగ్స్ ఏజెన్సీ స్కోప్‌.. రష్యా(Russia) జీడీపీలో ద్రవ్యలోటు 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. చమురు, గ్యాస్ ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం పడిపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే దీనికి ముందు పుతిన్‌(Putin) ప్రభుత్వం నుంచి వచ్చిన అంచనా మాత్రం రెండు శాతంగానే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని