Ukraine Crisis: యుద్ధట్యాంకుల సాయం ప్రకటన వేళ.. ఉక్రెయిన్‌పై 50కిపైగా క్షిపణి దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఏకంగా 50కిపైగా క్షిపణులతో దాడికి దిగింది. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందిస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

Published : 26 Jan 2023 22:55 IST

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine)కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులను సరఫరా చేయాలని అమెరికా, జర్మనీలు నిర్ణయించిన వేళ.. యుద్ధభూమిపై రష్యా(Russia) మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్‌(Kyiv)తోపాటు ఒడెస్సా తదితర ప్రాంతాలపై పదుల కొద్ది క్షిపణులు(Missile Attack), డ్రోన్‌లను ప్రయోగించింది. ఆయా చోట్ల మొత్తం 11 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. మరోవైపు.. జపోరిజియాలో విద్యుత్‌ కేంద్రంపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఒడెస్సాలో రెండు విద్యుత్‌ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా కీవ్‌తోపాటు ఒడెస్సా, వినిత్సియా తదితర ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ ప్రభుత్వం అత్యవసర విద్యుత్ కోతలు విధించింది.

తమ దేశంపై రష్యా దాదాపు 50కిపైగా క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వాటిలో 47 క్షిపణులను కూల్చేశామని, కీవ్‌ పరిసరాల్లోనే 20 వరకు ధ్వంసం చేశామని వెల్లడించింది. అంతకుముందు బుధవారం రాత్రి రష్యా డ్రోన్లతో దాడులకు దిగింది. మొత్తం 24 డ్రోన్‌లను కూల్చేయగా, ఇందులో 15 రాజధాని కీవ్ పరిసరాల్లోనే ఉన్నట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.

ఇదిలా ఉండగా.. మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్‌ ప్రారంభం నాటికి ఉక్రెయిన్‌కు లెపర్డ్‌-2 ట్యాంకులు చేరవేస్తామని జర్మనీ రక్షణశాఖ మంత్రి బోరిస్ పిస్టోరియస్ గురువారం వెల్లడించారు. కొద్ది రోజుల్లో ఈ ట్యాంకుల వినియోగంపై ఉక్రెయిన్‌ బలగాలకు శిక్షణ ప్రారంభిస్తామన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు ఆధునిక యుద్ధ ట్యాంకుల్ని సరఫరా చేయాలన్న అమెరికా, జర్మనీల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ తెలిపారు. ఈ వైఖరిని యుద్ధంలో ప్రత్యక్ష ప్రమేయంగా భావిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని