Russia Invasion: రష్యా ఈ యుద్ధాన్ని ఆపాల్సిందే..! ఐరాస చీఫ్‌

ఉక్రెయిన్‌లో 30లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోగా మరో 20లక్షల మంది స్వదేశంలోనే ఇతర చోట్లకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Published : 17 Mar 2022 19:40 IST

30లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్‌ దాటినట్లు వెల్లడి

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడి పౌరులు భారీ స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇలా ఇప్పటివరకు 30లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోగా మరో 20లక్షల మంది స్వదేశంలోనే ఇతర చోట్లకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇలా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పోరాడుతోన్న ఉక్రెయిన్‌ పౌరులకు శాంతి ఎంతో అవసరమని పేర్కొంది. ప్రపంచ దేశాలు కూడా ఇదే కోరుకుంటున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వెంటనే యుద్ధానికి రష్యా ముగింపు పలకాలని ఐరాస స్పష్టం చేసింది.

‘దాదాపు 30లక్షలకుపైగా ఉక్రెయిన్‌ శరణార్థులు దేశం విడిచి వెళ్లిపోయారు. తీవ్ర ఆపదలో ఉన్న ఉక్రెయిన్‌లకు శాంతి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. రష్యా వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలి’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఇదే విషయంపై వివరాలు వెల్లడించిన ఐరాస శరణార్థి విభాగం.. మరో 20లక్షల మంది దేశంలో ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయినట్లు తెలిపింది. తమ కుటుంబీకులను ఇతర ప్రాంతాలకు పంపిస్తోన్న ఫొటోలను షేర్‌ చేసిన యూఎన్‌హెచ్‌సీఆర్‌.. కేవలం శాంతి మాత్రమే వారిని తిరిగి కలుపుతుందని అభిప్రాయపడింది.

పోలండ్‌కు 20లక్షల మంది..

ఉక్రెయిన్‌ నుంచి శరణార్థులుగా వెళ్లిపోతున్న పౌరులు ఎక్కువగా సమీప పోలండ్‌కు చేరుకుంటున్నారు. పొలండ్‌ సరిహద్దు భద్రతా దళాల గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 19.5లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు తమ దేశంలోకి వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు హంగరీకి ఉక్రెయిన్‌ పౌరుల వలసలు పెరిగాయి. ఇదే విషయాన్ని వెల్లడించిన హంగరీ ప్రధానమంత్రి విక్టోర్‌ ఓర్బన్‌.. రానున్న రోజుల్లో తమదేశంలోకి శరణార్థుల తాడికి మరింత పెరగనున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దులో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించేందుకు సిబ్బందిని మరింత పెంచామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని