Ukraine Crisis: రష్యా నెక్ట్స్‌ టార్గెట్‌ అదేనా?.. ప్లాన్‌ బహిర్గతం!

ఉక్రెయిన్‌ తర్వాత రష్యా టార్గెట్‌ మాల్దోవా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 23 Nov 2022 10:16 IST

కీవ్‌: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ ఏడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని.. కేవలం నిస్సైనీకరణ మాత్రమే తమ లక్ష్యమంటూ రష్యా చెబుతోంది. కానీ, ఉక్రెయిన్‌ రాజధానితోపాటు ప్రధాన నగరాలపై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అంతేకాకుండా కి.మీ మేర కాన్వాయ్‌తో కూడిన సైనిక బృందాలను ఉక్రెయిన్‌లోనికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ తర్వాత రష్యా టార్గెట్‌ మాల్దోవా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సైనిక చర్య క్రమాన్ని వివరిస్తూ బెలారస్‌ అధ్యక్షుడు చూపించిన కీలక మ్యాప్‌ రష్యా పన్నాగానికి బలాన్ని చేకూరుస్తోంది.

మాల్దోవా లక్ష్యంగా..?

ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఆ దేశ భద్రతా మండలిలో చర్చించారు. ముఖ్యంగా సైనిక చర్యపై రష్యా ప్రణాళిక, వారి సేనలు మోహరిస్తోన్న వాహనాలు, ఆయుధ సామగ్రి, ఉక్రెయిన్‌ నగరాలపై దాడుల క్రమాన్ని ఓ మ్యాప్‌లో చూపిస్తూ అధ్యక్షుడు లుకషెంకో అధికారులకు వివరించారు. అందులో ఉక్రెయిన్‌ను నాలుగు భాగాలుగా చూపించారని.. దక్షిణ ఉక్రెయిన్‌ నుంచి ‘మాల్దోవా’ లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు విశ్లేషించాయి. మాల్దోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు ఆ మ్యాపులో ఉన్నాయని వెల్లడించాయి. బెలారస్‌ అధ్యక్షుడు ఆ మ్యాపులో వివరించినట్లుగానే రష్యా సేనలు దాడులు చేస్తుండడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే, ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరం నుంచి మాల్దోవాలోకి రష్యా సైన్యం ప్రవేశించాలంటే ఆ మార్గంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సరిహద్దుల్లో బెలారస్‌ బలగాలు..

రష్యా ప్రణాళిక, ఉక్రెయిన్‌పై దాడులకు సంబంధించి బెలారస్‌ అధ్యక్షుడు వారి అధికారులకు వివరించిన వీడియోను అధికార వెబ్‌సైట్‌లో పోస్టు చేశారు. అందులో మాల్దోవా దురాక్రమణ మినహా బెలారస్‌ నుంచి దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి జర్నలిస్ట్‌ కూడా ప్రస్తావించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు సరిహద్దు ప్రాంతంలో తమ బలగాలను మోహరించినట్లు భద్రతా మండలి సమావేశంలో అధ్యక్షుడు లుకషెంకో వెల్లడించారు. మరోవైపు పొలండ్‌ సరిహద్దులోనూ సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దాడిలో తాము పాలుపంచుకోమని  బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో చెప్పడం గమనార్హం.

ఇదిలాఉంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై చేస్తోన్న దాడులకు తమ భూభూగాన్ని ఉపయోగించుకోవచ్చని రష్యాకు ఇటీవలే అనుమతి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో బెలారస్‌ నుంచి ఇప్పటికే క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్‌ కూడా ఆరోపించింది. మరోవైపు పూర్వపు సోవియట్‌ యూనియన్‌ను తిరిగి సాకారం చేయాలని కలలుకంటోన్న పుతిన్‌ ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌, మాల్దోవా దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నంగా దీన్ని చెబుతున్నారు. గతంలో మాల్దోవా కూడా సోవియట్‌ యూనియన్‌లో భాగం కావడంతో ఆ దేశాన్ని మళ్లీ తన స్వాధీనం చేసుకునేందుకే పుతిన్‌ పన్నాగం పన్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని