పుతిన్‌కు మోదీ సూచన.. స్పందించిన రష్యా..!

ఇది యుద్ధాల యుగం కాదంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేశారు.

Published : 25 Sep 2022 01:32 IST

దిల్లీ: ఇది యుద్ధాల యుగం కాదంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేశారు. దీనిపై తాజాగా రష్యా స్పందించింది. పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని తమకు నచ్చినట్టుగా అన్వయించుకున్నాయని వ్యాఖ్యానించింది. 

‘పశ్చిమ దేశాలు అసలు విషయాన్ని పక్కన పెట్టి, తమకు కావాల్సిన వాక్యాన్ని నచ్చినట్టుగా అన్వయించుకుంటాయి’ అని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ చేసి ఎనిమిది నెలలు కావొస్తోంది. ఈ దాడికి ముగింపు ఇవ్వాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరైన మోదీ.. అక్కడే పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఆ సమయంలో పుతిన్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని ఆయనకు సూచించారు.

ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతున్న ఆహార, ఇంధన సంక్షోభాలకు వెంటనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఆయన పిలుపునకు సానుకూలంగా స్పందించిన పుతిన్‌.. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మోదీ సూచనను అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ప్రశంసిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకే ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts