Crimea bridge: రష్యాను ముప్పుతిప్పలు పెడుతున్న కిల్లర్‌ డ్రోన్లు..!

రష్యా-క్రిమియాను కలిపే అత్యంత కీలకమైన కెర్చ్‌ వంతెనపై జరిగిన దాడితో ఉక్రెయిన్‌ కిల్లర్‌ డ్రోన్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ దాడికి సముద్ర డ్రోన్లను వాడి ఉంటారని రష్యా అనుమానిస్తోంది.

Published : 17 Jul 2023 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine) అమ్ములపొదిలోని పడవ డ్రోన్లు రష్యా(Russia)ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. తాజాగా క్రిమియాను రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్‌ వంతెన (Crimea bridge) వద్ద సోమవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఇప్పటికే గతేడాది ఓ సారి ఈ వంతెనపై భారీ దాడి జరగడంతో రష్యా ఇక్కడ భద్రతను గణనీయంగా పెంచింది. అయినా.. దీనిపై తాజాగా దాడి జరిగింది. పేలుడు తీవ్రతకు వంతెనలోని ఓ వైపు భాగం కుంగిపోయింది. ఫలితంగా ఇక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 

కెర్చ్‌ వంతెనపై ఉక్రెయిన్‌ కన్ను..

రష్యా 2014లో ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను ఆక్రమించుకొంది. దీనిని తమ ప్రధాన భూభాగంతో కలిపేందుకు భారీ వ్యయంతో కెర్చ్‌ వంతెన నిర్మించింది. ఫలితంగా రష్యా దళాలు అక్కడకు చేరుకోవడానికి మార్గం సుగమం అయింది. 2022లో ఉక్రెయిన్‌ ప్రధాన భూభాగంపై రష్యా దాడులు మొదలు పెట్టింది. నాటి నుంచి కీవ్‌ బలగాల దృష్టి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కెర్చ్‌ వంతెనపై ఉంది. ఉక్రెయిన్‌ భవిష్యత్తులో క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవాలటే.. ఈ వంతెనను దెబ్బతీయడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్రిమియాలో దళాలు మోహరించడానికి మాస్కోకు పెద్దగా ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. కొన్ని రోజులపాటు ఈ వంతెన నిరుపయోగంగా మారినా.. కీవ్‌ దళాలకు బాగా కలిసివస్తుంది.   

మరోసారి క్రిమియా వంతెనపై దాడి..!

ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌ దళాలు ఎదురుదాడుల తీవ్రతను పెంచుతున్నాయి. ఎదురుదాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రష్యా దళాల నుంచి 210 చదరపు కిలోమీటర్లను కీవ్‌ సేనలు స్వాధీనం చేసుకొన్నట్లు  ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌’ లెక్కలు చెబుతున్నాయి. 

రంగంలోకి బోట్‌ డ్రోన్లు..

ఉక్రెయిన్‌ వద్ద ఉన్న మారిటైం అన్‌మ్యాన్డ్‌ సర్ఫేస్‌ వెస్సల్స్‌ (యూఎస్‌వీ)లపై రష్యా నౌకాదళంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. క్రిమియాలోని రష్యా నౌకాదళ స్థావరం ఉన్న సెవస్తపొల్‌పై ఈ రకం బోట్లు తరచూ దాడులు చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో తొలిసారి ఏడు సముద్ర డ్రోన్లు రష్యా దళాలపై దాడికి దిగాయి. 5.5 మీటర్ల పొడవు, టన్ను బరువు, 60 గంటలపాటు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది. వీటిల్లో 200 కిలోల పేలుడు పదార్థాలను కూడా అమర్చవచ్చు. ఇవి అత్యధికంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. చిన్న ఆకారంలో.. చురుగ్గా కదిలే ఈ బోట్లు ఇటీవల కాలంలో తరచూ రష్యా నౌకలపై దాడులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ఇటువంటి ఓ బోటును రష్యా దళాలు పేల్చేశాయి. అంతకు నెల రోజుల ముందు కూడా ఇటువంటి దాడి జరిగింది. ఉక్రెయిన్‌ దళాలు వీటి వినియోగంపై కచ్చితమైన శిక్షణ పొంది ఉంటాయని రష్యా అనుమానిస్తోంది. తాజాగా కెర్చ్‌ వంతెనపై జరిగిన దాడిలో కూడా ఇటువంటి బోట్లను వాడినట్లు రష్యా యాంటీ టెర్రరిస్టు కమిటీ వెల్లడించింది. ఉక్రెయిన్‌ స్పెషల్‌ సర్వీస్‌ దళాలు ఈ దాడిని చేశాయని పేర్కొంది.

అమెరికా, బ్రిటన్‌ల సహకారంపై రష్యా అనుమానాలు..

కెర్చ్‌ వంతెన పేలుళ్ల వెనుక ఉక్రెయిన్‌ దళాలతోపాటు.. బ్రిటన్‌, అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల హస్తం కూడా ఉన్నట్లు క్రెమ్లిన్‌ అనుమానిస్తోంది. దీనిపై రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జకరోవా మాట్లాడుతూ బ్రిటన్‌, అమెరికా నిఘా సంస్థలు కీవ్‌కు సాయం చేశాయని ఆరోపించారు. మరోవైపు ఈ దాడిలో తమ దళాల పాత్రపై ఉక్రెయిన్‌ నర్మగర్భ వాఖ్యలు చేసింది. సోమవారం ఉదయం ఆ దేశ  సెక్యూరిటీ సర్వీసెస్‌ ఓ లేఖను విడుదల చేసింది. విజయం తర్వాత పేలుళ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది. ‘‘పుతిన్‌ నియంతృత్వ పాలనకు చిహ్నంగా నిలిచిన ఓ నిర్మాణం మన సైనిక శక్తిని తట్టుకోలేకపోవడాన్ని ఆసక్తిగా చూస్తున్నాం’’ అని  ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రతినిధి ఆర్టెం ఓ వార్తా సంస్థ వద్ద పేర్కొన్నారు. గత కొంత కాలంగా రష్యా భూభాగంపై జరుగుతున్న దాడుల్లో తమ పాత్ర ఉన్నట్లు ఉక్రెయిన్‌ పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం సర్వసాధారణమైంది. ఇక ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ ఈ వంతెనపై దాడికి స్పందిస్తూ.. ‘‘రష్యా నరమేధానికి సహకరించే ఏ అక్రమ కట్టడమైనా స్వల్పకాలమే ఉంటుంది’’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని