Drone Attack: పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర..! రష్యా సంచలన ఆరోపణ

అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ ప్రయత్నాలు చేస్తోందని రష్యా ఆరోపించింది. ఈ క్రమంలోనే క్రెమ్లిన్‌పై డ్రోన్‌ దాడి జరిగిందని తెలిపింది.

Updated : 03 May 2023 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) హత్యకు ఉక్రెయిన్‌ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనంపై (Kremlin) డ్రోన్‌ దాడి జరిగిందని పేర్కొంది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన రెండు డ్రోన్లను (Drone Attack) కూల్చివేశామని వెల్లడించింది. దీన్ని ఉగ్ర ప్రణాళికగా భావిస్తున్నామన్న రష్యా.. తమ అధ్యక్షుడిని అంతం చేసేందుకే ఈ ప్రయత్నాలని ఆరోపించింది. అయితే, డ్రోన్‌ దాడి ఉక్రెయిన్‌ చేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలనూ వెల్లడించలేదు. కానీ, సరైన సమయంలో దీటుగా స్పందిస్తామని రష్యా పేర్కొంది.

‘క్రెమ్లిన్‌ లక్ష్యంగా రెండు డ్రోన్లు దూసుకొచ్చాయి. వెంటనే స్పందించి వాటిని కూల్చివేశాం. ఈ ఘటనలో పుతిన్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాడి సమయంలో పుతిన్‌ క్రెమ్లిన్‌లో లేరు. నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారు. క్రెమ్లిన్‌ భవనానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు’ అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. పుతిన్‌ సురక్షితంగా ఉన్నారన్న ఆయన.. అధ్యక్షుడి షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదన్నారు. ఈ డ్రోన్ల దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయం వెల్లడైన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నగరంలో ఎటువంటి అనధికారిక డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధిస్తున్నట్లు మాస్కో మేయర్‌ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవి కాకుండా మిగతా ఎటువంటి డ్రోన్లు ఎగిరేందుకు అనుమతి లేదని ప్రకటించారు. మరోవైపు మే 9 మాస్కోలో విక్టరీ డే పరేడ్‌ నిర్వహించనున్నారు. ఈ డ్రోన్ల దాడి కలవరం సృష్టించినప్పటికీ ఆ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని క్రెమ్లిన్‌ వెల్లడించింది.

డ్రోన్‌ దాడితో సంబంధం లేదు : ఉక్రెయిన్‌

రష్యా అధ్యక్ష భవనం(క్రెమ్లిన్‌)పై జరిగిన డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్‌ స్పందించింది. డ్రోన్‌ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అలా చేయడం ఉక్రెయిన్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని.. కేవలం రష్యా మరింతగా దాడులు చేసేందుకు కారణమవుతుందని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో రష్యా చేయనున్న దాడులను సమర్థించుకోవడానికే క్రెమ్లిన్‌ తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్‌ తెలిపింది. తాజా పరిణామాలను చూస్తుంటే ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందని జెలెన్‌స్కీ సలహాదారు మైకిలో పొదొల్యాక్‌ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తుతం ఫిన్లాండ్‌ పర్యటనలో ఉన్నారు.

జెలెన్ స్కీ నివాసంపై క్షిపణి ప్రయోగించాల్సిందే.. రష్యన్‌ ఎంపీల డిమాండ్‌

రష్యాపై డ్రోన్‌ దాడులకు పాల్పడుతోన్న ఉక్రెయిన్‌పై  తీవ్ర దాడులతో ప్రతిఘటించాల్సిందేనంటూ రష్యన్‌ పార్లమెంట్‌ సభ్యుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. రష్యా పార్లమెంట్‌ దిగువసభ డ్యూమా ఛైర్మన్‌గా ఉన్న వచెస్లావ్‌ వొలొదిన్‌ (Vyacheslav Volodin).. డ్రోన్‌ దాడికి ప్రతిస్పందనగా కీవ్‌ను అడ్డుకోగల, నాశనం చేయగల ఆయుధాలను ఉపయోగించాలన్నారు. క్రెమ్లిన్‌పై దాడి అనంతరం టెలిగ్రామ్‌లో స్పందించిన ఆయన.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో రష్యా చర్చలు జరపవద్దని స్పష్టం చేశారు. మరో డ్యూమా సభ్యుడు మికెల్‌ షెరెమెట్‌ మాట్లాడుతూ.. కీవ్‌లోని జెలెన్‌స్కీ నివాసంపై క్షిపణి ప్రయోగం జరపాలని పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని