Ukraine Talks: ఉక్రెయిన్‌-రష్యా.. రెండోవిడత చర్చలపై సందిగ్ధత..!

ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్ష భవనం వెల్లడించింది.

Published : 02 Mar 2022 17:57 IST

తమ బృందం సిద్ధమన్న రష్యా, ఉక్రెయిన్‌ నుంచి రాని స్పష్టత

మాస్కో: ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్ష భవనం వెల్లడించింది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం నుంచి తమ ప్రతినిధుల బృందం సిద్ధంగా ఉంటుందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రివ్‌ పెస్కోవ్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, ఈసారి చర్చలు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు ఈ చర్చలపై ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడం గమనార్హం.

కాల్పుల విరమణపై ఇరు దేశాలు తొలిదఫా శాంతి చర్చలను బెలారస్‌-ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతమైన గోమెల్‌లో ఆదివారం జరిపాయి. అయినప్పటికీ అవి అసంపూర్తిగానే ముగిశాయి. అయితే, మరోదఫా చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా నేడు మరోసారి చర్చలు జరుగనున్నాయి.

మరోవైపు శాంతి చర్చలపై రష్యా తీరు ఇలా ఉంటే, ఉక్రెయిన్‌ మాత్రం క్రెమ్లిన్‌ తీరును ఎండగడుతోంది. ఓవైపు చర్చలు అంటూనే రష్యా సైన్యం భీకర దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా సామాన్య పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడడాన్ని మారణహోమంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణపై అర్థవంతమైన చర్చ జరగాలంటే.. ఉక్రెయిన్‌ నగరాలపై బాంబు దాడుల్ని నిలివేయాలని అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఈ ఉదయం డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణులతో భీకర దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. దీంతో రెండోదఫా శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు