Russian Warship: యుద్ధనౌకకు భారీ నష్టం.. అంగీకరించిన రష్యా..!

తీరప్రాంత నగరాలపై దాడులు చేసేందుకు భారీ ఆయుధ సామగ్రిని రష్యా చేరవేస్తోంది. ఈ క్రమంలో భారీ యుద్ధ నౌకకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 14 Apr 2022 17:10 IST

తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించిన రష్యా అధికారులు

కీవ్‌: ఆరు వారాలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తోన్న రష్యా.. పలు నగరాలను పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా తీరప్రాంత నగరాలపై దాడులు చేసేందుకు భారీ ఆయుధ సామగ్రిని తరలిస్తోంది. ఈ క్రమంలో రష్యా యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతింది. నౌకలో పేలుడు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు ధ్రువీకరించారు. యుద్ధ నౌకలో మందుగుండు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. సిబ్బందిని మాత్రం సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. మరోవైపు రష్యా యుద్ధనౌకపై తామే క్షిపణితో దాడి చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించగా.. రష్యా మాత్రం దాన్ని తోసిపుచ్చింది.

మేరియుపోల్‌, ఒడెస్సా వంటి తీర ప్రాంత నగరాలను లక్ష్యంగా చేసుకుంటోన్న రష్యా సేనలు.. దాడులకు యుద్ధ నౌకలను కూడా వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ తీరప్రాంతానికి రష్యాకు చెందిన మాస్క్వా క్రూజ్‌ చేరుకోగానే దానిపై క్షిపణితో దాడికి పాల్పడినట్లు ఒడెస్సా గవర్నర్‌ ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్‌ రక్షణశాఖ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు.

ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నప్పటికీ రష్యా భారీ స్థాయిలో నష్టాలను చవిచూస్తోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 20వేల సైనికులతో పాటు భారీ స్థాయిలో వైమానిక, యుద్ధ సామగ్రి, ఆయుధాలను రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడిస్తోంది. రష్యాపై యుద్ధం కొనసాగించడానికి తమకు ఆయుధాలు సమకూర్చాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే, తమవైపు కేవలం 1350 మంది మాత్రమే చనిపోయారని పేర్కొంటోన్న రష్యా.. తమ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలు చేరే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని