ఉక్రెయిన్‌లో పురుషులనూ వదలని రష్యన్లు..

కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.

Published : 05 May 2022 01:34 IST

ఆధారాలు సేకరిస్తున్నామన్న ఐరాస

కీవ్‌: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యాసేనలు చేస్తోన్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోన్న రష్యా సైన్యం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటికే డజనుకుపైగా కేసులను గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడంలో భాగంగానే రష్యా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికనందునే  తాము క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నట్లు ఐరాస పేర్కొంది.

గుర్తించడం ఓ సవాలే..

‘అత్యాచారాన్ని కళంకంగా భావించడంతోపాటు ఇతర కారణాల వల్ల మహిళలు, బాలికలు వాటిని బయటకు వెల్లడించలేకపోతారు. ఇక పురుషుల విషయానికి వస్తే ఇది మరింత కష్టం. లైంగిక హింస కేసులను గుర్తించడానికి బాధితులందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి’ అని యుద్ధాల్లో లైంగిక నేరాలపై దర్యాప్తు జరుపుతోన్న ఐరాస విభాగ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా ప్యాటెన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే డజనుకు పైగా ఇటువంటి కేసులపై దర్యాప్తు జరుపుతున్నామన్న ఆమె.. బయటపడని కేసులెన్నో ఉండవచ్చాన్నారు. అత్యాచారం నుంచి బయటపడిన మగవారు ఆ నేరం గురించి వెల్లడించడం సవాలుతో కూడుకున్నదన్నారు. అయినప్పటికీ దోషులను గుర్తించి వారిని అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టేందుకు బాధితులు ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.

వ్యూహంలో భాగమే..

మరోవైపు పురుషులు, మహిళలు, చిన్నారులపై రష్యా సైన్యం జరుపుతోన్న లైంగిక దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ ఇరినా వెనెదిక్తొవా పేర్కొన్నారు. వ్యూహంలో భాగంగానే రష్యా సేనలు ‘అత్యాచారం’ అనే ఆయుధాన్ని వాడుకుంటోందని ఆరోపించిన ఆమె.. ఉక్రెయిన్‌ పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునే వ్యూహమేనన్నారు. ఇటువంటి నేరాలపై కొందరు మాత్రమే ఉక్రెయిన్‌లు పెదవి విప్పుతుండగా.. మరికొందరు మాత్రం దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఈ తరహా లైంగిక నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని వెనెదిక్తొవా వెల్లడించారు.

స్పష్టమైన సంకేతాలు..

ఉక్రెయిన్‌లో యుద్ధం పేరుతో రష్యా సైన్యం సృష్టిస్తోన్న అరాచకాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. గ్యాంగ్‌రేప్‌లు, కుటుంబ సభ్యులముందే లైంగిక దాడుల వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. కేవలం ఒక్క బుచా నగరంలోని ఓ బేస్‌మెంట్‌లోనే మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించి ఇప్పటికే 25మంది బాధితులను నుంచి ఆధారాలు సేకరించినట్లు ఐరాస పేర్కొంది. వీటితోపాటు చనిపోయిన వారిపై లైంగిక దాడిని గుర్తించేందుకు మృతదేహాలకు పొస్టుమార్టం చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో లైంగిక హింస ఘటనలు క్రమబద్ధంగా కొనసాగుతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నందునే తాను కీవ్‌లో పర్యటిస్తున్నట్లు ఐరాస ప్రతినిధి ప్యాటెన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని