Russia: క్షిపణులు రేపిన చిచ్చు..! అమెరికా రాయబారికి రష్యా సమన్లు

క్రిమియాపై జరిపిన దాడుల్లో అమెరికా తయారు చేసిన అధునాతన క్షిపణులను ఉక్రెయిన్‌ వినియోగించినట్లు రష్యా ఆరోపించింది.

Published : 24 Jun 2024 21:41 IST

మాస్కో: రష్యా (Russia)తోపాటు క్రిమియాపై ఉక్రెయిన్‌ (Ukraine) పెద్దఎత్తున డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. అయితే.. క్రిమియాపై జరిపిన దాడుల్లో అమెరికా (USA) తయారు చేసిన అధునాతన క్షిపణులను కీవ్‌ వినియోగించినట్లు మాస్కో ఆరోపించింది. దీనికి నిరసనగా అగ్రరాజ్య రాయబారి లీన్‌ ట్రేసీకి సమన్లు జారీ చేసింది. ‘‘ఉక్రెయిన్ పక్షాన నిలుస్తూ.. యుద్ధంలో అమెరికా కూడా ఒక భాగంగా మారింది. ఇటువంటి క్షిపణి దాడుల వెనుక ఆ దేశ సైనిక నిపుణుల హస్తం ఉంది. ఈ ఘటనలకు వాషింగ్టన్‌ కూడా సమాన బాధ్యత వహించాల్సిందే. మా భూభాగంపై దాడులకు ప్రతీకార చర్యలు తప్పవు’’ ఒక ప్రకటనలో పేర్కొంది.

రష్యాలో ఉగ్రదాడి.. 15 మంది పోలీసుల మృతి!

అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను తమ భూభాగంపై వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పుతిన్‌ మొదటినుంచి హెచ్చరిస్తున్నారు. అయితే.. ఆత్మరక్షణార్థం తాము సరఫరా చేసిన సుదీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంలో దాడికి వినియోగించొచ్చని వాషింగ్టన్‌ ఇటీవలే కీవ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజా దాడులు జరిగాయి. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన క్షిపణులు, ఇతర ఆయుధాలను నిల్వ ఉంచిన ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రధాన లాజిస్టిక్‌ కేంద్రంపై దాడి చేసినట్లు రష్యా రక్షణశాఖ సోమవారం తెలిపింది. కానీ, ఎక్కడనేది వెల్లడించలేదు. అంతకుముందు ఖర్కీవ్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక పౌరుడు మరణించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని