Russia: మా భూభాగాలు స్వాధీనం చేసుకొని తీరతాం: ఉక్రెయిన్‌

రష్యా దాడుల దెబ్బకు ఉక్రెయిన్‌కు కరెంటు కష్టాలు పెరిగాయి. అయినా  మాస్కోకు లొంగమని కీవ్‌ నాయకత్వం తెగేసి చెబుతోంది.

Published : 26 Nov 2022 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  యుద్ధం ముగిసి కీవ్‌ కష్టాలు తీరాలంటే మాస్కో డిమాండ్లను ఆమోదించాలంటూ ఇచ్చిన ఆఫర్‌ను కీవ్‌ నాయకత్వం తోసిపుచ్చింది. ఏ మాత్రం వెనక్కి తగ్గమమని ఉక్రెయిన్‌ నాయకత్వం తెగేసి చెబుతోంది. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ పై క్షిపణుల వర్షం కురిపించడంతో ఉక్రెయిన్‌లోని చాలా చోట్ల విద్యుత్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్‌ లభించకపోవడంతో చలికి తట్టుకోలేక వలసవెళుతున్నారు. ‘‘పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉక్రెయిన్‌ ఎదుట చాలా అవకాశాలు తెరిచే ఉన్నాయి. రష్యా వైపు డిమాండ్లను ఆమోదించి సమస్యలను పరిష్కరించుకొనే అవకాశాలున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితిని తొలగించుకోవచ్చు’’ అని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. మరో వైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. వ్యూహాత్మకంగా విద్యుత్‌ వ్యవస్థలపై రష్యా చేసే దాడులు తమ దేశాన్ని బలహీన పర్చలేవని పేర్కొన్నారు. తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలను తగ్గించలేవన్నారు.  ‘‘మా భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకొని తీరతాం. దౌత్యానికి మార్గం లేనప్పుడు యుద్ధమే మార్గమని నేను నమ్ముతాను’’ అని ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదంగా ఐరోపా సమాఖ్య ప్రకటించింది. త్వరలోనే జీ7 దేశాలతో కలిసి ఇంధన నియంత్రణ ధరలను ప్రకటిస్తామని ఐరోపా సమాఖ్య కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా ప్రకటించారు. మరోవైపు కీవ్‌లో ప్రజలు ఖాళీ బాటిళ్లు పట్టుకొని నీటికోసం వెతుకుతున్న దృశ్యాలు వెలుగు చూస్తున్న సమయంలో రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడింది. రష్యా క్షిపణి దాడుల దెబ్బకు కీవ్‌ నగరంలో 70శాతం అంధకారం అలముకొంది. ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. ఇక ఖేర్సాన్‌లోని వైద్యశాలల్లో విద్యుత్‌, నీరు అందుబాటులో లేదు. గురువారం అక్కడి వాణిజ్య, నివాస సముదాయాలపై క్షిపణి దాడులు జరిగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని