Ukraine Crisis: యుద్ధం @ 50 డేస్‌.. 20వేల మంది రష్యా సైనికులు మృతి.. 10 కీలక పాయింట్లు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు మొదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఇంకా లుహాన్స్క్‌, ఖర్కివ్‌, మేరియుపొల్ సహా పలు నగరాలపై పుతిన్‌ సేనలు విరుచుకుపడుతూనే ఉన్నాయి......

Updated : 15 Apr 2022 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు మొదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికీ ఇంకా లుహాన్స్క్‌, ఖర్కివ్‌, మేరియుపొల్ సహా పలు నగరాలపై పుతిన్‌ సేనలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. రష్యా సేనల భీకర దాడుల్ని ఉక్రెయిన్‌ సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. ‘మా దేశాన్ని లొంగ దీసుకునేందుకు 5 రోజులు చాలని దురాక్రమణదారులు భావించారు. కానీ, 50 రోజులుగా మేం పోరాడుతూనే ఉన్నాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావోద్వేగంగా ప్రసంగించారు. యుద్ధాన్ని ఎదుర్కొనే ధైర్యం తమకు ఉందన్న ఆయన.. తమకు ఆయుధాలు సమకూర్చాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. 

  1. రష్యా దూకుడును ఉక్రెయిన్‌ దీటుగా ఎదుర్కొంటోంది. పుతిన్‌ సేనలకు ఎక్కడికక్కడ బ్రేక్‌లు వేస్తూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 20వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ ప్రకటించింది. 163 యుద్ధవిమానాలతోపాటు 144 హెలికాప్టర్లు, 756 ట్యాంకులు, 1443 సాయుధ శకటాలు, 76 ఇంధన ట్యాంకులు, ఎనిమిది నౌకలు సహా భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది. 
  2. యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌ నుంచి దాదాపు 50 లక్షల మంది ఇతర దేశాలకు తరలివెళ్లారని యూఎన్‌ శరణార్థుల విభాగం హైకమిషనర్‌ వెల్లడించారు. అలాగే, ఉక్రెయిన్‌ వ్యాప్తంగా 71 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో పురుషులు ఉక్రెయిన్‌ వీడటంపై నిషేధం ఉండటంతో.. శరణార్థులుగా పొరుగు దేశాలకు వెళ్లిన వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
  3. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా తమ బలగాలు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు చెందిన 456 డ్రోన్‌లు, 2,213 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కొనాషెంకోవ్‌ తెలిపారు.
  4. దక్షిణ ఖేర్సన్‌ ప్రాంతంలో ఖైదీల మార్పిడికి ఇరు దేశాలూ అంగీకరించినట్టు ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన చర్చల అనంతరం.. పోసాద్‌-పొక్రొవ్‌స్కోయ్‌ గ్రామం సమీపంలో ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరినట్టు ఉక్రెయిన్‌ తెలిపింది.
  5. తమ భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు, విధ్వంసానికి పాల్పడినా.. ప్రతిస్పందనగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులను ఉద్ధృతం చేస్తామని రష్యా రక్షణశాఖ హెచ్చరించింది. దక్షిణ రష్యాలోని బ్రియాన్స్క్‌ ప్రాంతంలో ఓ పట్టణంపై రెండు ఉక్రెయిన్‌ హెలికాప్టర్ల దాడుల్లో.. ఓ చిన్నారితోపాటు ఏడుగురు గాయపడినట్టు రష్యా ఆరోపించగా.. కీవ్‌ ఆ వార్తలను ఖండించింది.
  6. నాటోలో చేరిక విషయంలో ఫిన్‌లాండ్‌, స్వీడన్‌లకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. నాటోలో చేరే ముందు దాని వల్ల కలిగే పర్యవసనాలను అర్థం చేసుకోవాలని సూచించింది. నాటోలో చేరితే ద్వైపాక్షిక సంబంధాలతోపాటు యూరప్‌ భద్రతా నిర్మాణం విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అధికారులు అర్థం చేసుకోవాలని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
  7. తమ యుద్ధనౌక మాస్క్‌వా నీటమునిగినట్లు రష్యా అంగీకరించిందని బ్రిటన్‌ రక్షణ శాఖ తన తాజా ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో వెల్లడించింది. రష్యా నౌకాదళంలోని మూడు స్లావా-క్లాస్ యుద్ధనౌకల్లో.. సోవియట్‌ కాలం నాటి మాస్క్‌వా ఒకటని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. నల్ల సముద్రంలో నావికాదళం పనితీరుపై రష్యా సమీక్ష చేసే అవకాశం ఉందని పేర్కొంది.
  8. కీవ్‌ శివారులోని ఓ మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి ప్రయోగించింది. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక, ఖర్ఖివ్‌కు సమీపంలో ఉన్న ఓ గ్రామంపై రష్యా వ్యూహాత్మక రాకెట్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌ కోసం పోరాడుతోన్న 30 మంది పోలాండ్‌ సైనికులను హత్య చేసినట్లు రష్యా మిలిటరీ తెలిపింది.
  9. తూర్పు ఉక్రెయిన్‌ డొనెట్స్క్ ప్రాంతంలోని పోపాస్నా, రూబిజ్నే నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. ఎనిమిది రష్యన్‌ దాడులను తిప్పికొట్టామని, నాలుగు రష్యా యుద్ధ ట్యాంకులు, ఆరు సాయుధ వాహనాలు, నాలుగు పదాతిదళ పోరాట వాహనాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
  10. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతాల నుంచి పౌరుల తరలింపునకు శుక్రవారం తొమ్మిది మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్‌ వెల్లడించారు. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ రీజియన్‌ల నుంచి గురువారం 2500 మందిని తరలించినట్లు తెలిపారు. పోర్ట్‌ సిటీ మేరియుపొల్‌ నుంచి 289 మంది సొంత వాహనాల ద్వారా బయటపడ్డారని చెప్పారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని