Ukraine Crisis: ‘ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం’.. కీవ్‌లో 35 గంటల కర్ఫ్యూ

ప్రభుత్వం కీవ్‌లో కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి 8 నుంచి గురువారం రాత్రి 7గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని మేయర్‌ విటాలి క్లిట్ష్‌కో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.......

Updated : 15 Mar 2022 21:49 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. నగరాలపై పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యన్‌ బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం షెల్స్‌లో దాడి చేసింది. కాగా ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృత్యువాతపడ్డారు. మరిన్ని బాంబు దాడులు ఎదుర్కోబోతున్నామనే సమాచారంతో స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీవ్‌లో 35 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని మేయర్‌ విటాలి క్లిట్ష్‌కో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

‘ఈ చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొబోతున్నాం’ అని మేయర్‌ విటాలి క్లిట్ష్‌కో ట్వీట్‌ చేశారు. ‘రాజధాని కీవ్‌ ఉక్రెయిన్‌కు గుండెకాయ లాంటిది. దాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటాం. ప్రస్తుతం ఐరోపా స్వేచ్ఛ, భద్రతకు చిహ్నంగా.. ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌గా ఉన్న కీవ్‌ను వదులుకోబోం’ అని స్థానిక మేయర్ వెల్లడించారు.

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్ర 20వ రోజుకు చేరింది. దాడులు ప్రారంభించినప్పటి నుంచి రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలని పుతిన్‌ సర్కారు ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు అనుగుణంగానే ఎత్తులు వేస్తూ ఆక్రమణలకు పాల్పడుతోంది. బాంబులు, క్షిపణులతో ప్రభుత్వ కార్యాలయాలు, మిలటరీ క్యాంపులు, ఇతర ప్రధాన ప్రాంతాలపై దాడులు చేస్తూ.. ఆయా ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ పట్టుకోల్పోయేలా చేస్తోంది. అనంతరం ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని