Ukraine Crisis: మొదటి రోజు రష్యా సైన్యాలు విఫలం: బ్రిటన్‌

ఉక్రెయిన్‌ను మొత్తంగా స్వాధీనం చేసుకోవడం రష్యా ఉద్దేశమని, కానీ.. మొదటి రోజు చేపట్టిన దాడిలో ఆ దేశ సైన్యం విఫలమైందని బ్రిటన్‌ రక్షణశాఖ కార్యదర్శి బెన్ వాలెస్ వ్యాఖ్యానించారు. గురువారం రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. అయితే, మాస్కో బలగాలు.. తొలి రోజు...

Published : 25 Feb 2022 18:32 IST

లండన్‌: ఉక్రెయిన్‌ను మొత్తంగా స్వాధీనం చేసుకోవడం రష్యా ఉద్దేశమని, కానీ.. మొదటి రోజు చేపట్టిన దాడిలో ఆ దేశ సైన్యం విఫలమైందని బ్రిటన్‌ రక్షణశాఖ కార్యదర్శి బెన్ వాలెస్ వ్యాఖ్యానించారు. గురువారం రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. అయితే, మాస్కో బలగాలు.. తొలి రోజు తమ ప్రధాన లక్ష్యాలను సాధించలేకపోయాయని వాలెస్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించడమే రష్యా ఉద్దేశమని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వాదనలు సహేతుకం కావని పేర్కొన్నారు. ‘పుతిన్‌.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో విజృంభిస్తున్నారు. ఇప్పుడు టీవీల్లో చూస్తున్నట్లుగా మరెవరూ ఇలా చేయరు’ అని అన్నారు.

సైనిక చర్య మొదటి రోజు తమ ప్రధాన లక్ష్యాలన్నింటినీ సాధించామన్న రష్యా రక్షణ శాఖ ప్రకటనను వాలెస్‌ ఖండించారు. ఆ సైన్యం.. ఏ ప్రధాన లక్ష్యాలనూ సాధించలేదన్నారు. ఉక్రెయిన్‌లోని ముఖ్యమైన విమానాశ్రయాల్లో ఒకదాన్ని స్వాధీనం చేసుకోవడంలో రష్యా బలగాలు విఫలమయ్యాయని, ఉక్రేనియన్లు దాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రేనియన్లు ఏదో విధంగా విముక్తి పొందుతారని పుతిన్‌ భావించారని.. కానీ, అది పూర్తిగా తప్పు అని తెలిపారు. మరోవైపు రష్యా ఇప్పటివరకు 450 మందికి పైగా సిబ్బందిని కోల్పోయిందని వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం.. తన సొంత ప్రజలపై మారణహోమం చేయడాన్ని నిలువరించేందుకునే రష్యా ప్రత్యేక సైనిక ఆపరేషన్ చేపడుతోందని పుతిన్ ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని