Ukraine Crisis: అప్పుడే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం: రష్యా

రష్యా-ఉక్రెయిన్ యుద్ధక్రమంలో అణు ప్రకటనలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల వాడకంపై రష్యా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశ అస్తిత్వానికి ముప్పు ఎదురైనప్పుడు మాత్రమే తాము వాటిని వాడతామని వెల్లడించింది.

Updated : 23 Mar 2022 16:14 IST

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధక్రమంలో అణు ప్రకటనలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల వాడకంపై రష్యా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశ అస్తిత్వానికి ముప్పు ఎదురైనప్పుడు మాత్రమే తాము వాటిని వాడతామని వెల్లడించింది.

‘మాకు దేశీయ భద్రత అనే విధానం ఉంది. అది బహిర్గతమే. అణ్వాయుధాలు వాడటానికి గల కారణాలన్నీ మీరు చదవగలరు. ఈ సైనిక చర్య నేపథ్యంలో మా దేశానికి అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే.. మా విధానానికి అనుగుణంగా మేం వాటిని ఉపయోగించవచ్చు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మీడియాకు వెల్లడించారు. అధ్యక్షుడు పుతిన్‌ అణ్వాయుధాలను వాడరని నమ్మకంగా ఉన్నారా..? అని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 24న రష్యా.. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య ప్రారంభించింది. నాలుగు రోజుల తర్వాత ప్రపంచాన్ని కలవరానికి గురిచేసేలా అణ్వాయుధాల పై ప్రకటన చేసింది. తమ వ్యూహాత్మక అణ్వాయుధ బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు వెల్లడించింది. 

ఇదిలా ఉండగా.. పెస్కోవ్‌ వ్యాఖ్యలపై పెంటాగన్ ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పందించారు. ‘ఈ తీరు ప్రమాదకరం. బాధ్యతాయుతమైన అణ్వాయుధదేశం ప్రవర్తించే విధానం ఇది కాదు. అయితే, ప్రస్తుతం మా వ్యూహాత్మక విధానంలో మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. మేం తాజా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం’ అని వ్యాఖ్యానించారు. రష్యా ప్రకటన తర్వాత చెప్పుకోదగ్గవిధంగా అణ్వాయుధాల కదలికల సంకేతాలు లేవని పశ్చిమ దేశాలు వెల్లడిస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని