Ukraine Crisis: విక్టరీ డే వేళ.. రష్యా రాయబారిపై ఎర్ర సిరాతో దాడి

విక్టరీ డే పురస్కరించుకొని పొలండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురయ్యింది.

Published : 09 May 2022 22:39 IST

పొలండ్‌లోని రష్యా రాయబారికి నిరసనల సెగ

మాస్కో: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ‘విక్టరీ డే’ పేరుతో రష్యా ఉత్సవాలు చేసుకుంటోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాకు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విక్టరీ డే పురస్కరించుకొని పొలండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆందోళనలు చేపట్టిన నిరసనకారులు.. రష్యా రాయబారి ముఖంపై ఎరుపు రంగు సిరాతో దాడి చేశారు. ఉక్రెయిన్‌లో మారణహోమానికి ప్రతీకగా రక్తం రంగులో ఉన్న ఎరుపు రంగు సిరాను పూసుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.

రష్యా జరుపుకొంటున్న విక్టరీ డే ఉత్సవాల్లో భాగంగా పొలండ్‌లో రష్యా రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌ అమరవీరులకు నివాళులు అర్పించేందుకుగాను వారి సమాధుల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఉక్రెయిన్‌ మద్దతుదారులు సెర్గీ ఆండ్రీవ్‌ను చుట్టుముట్టారు. అంతేకాకుండా వారి చేతుల్లో ఎర్ర సిరాను ఆయన ముఖంపై చల్లడంతోపాటు నియంత, హంతకుడంటూ నినాదాలు చేశారు.

ఇలా నిరసనకారులు సిరాతో దాడి చేస్తున్న సమయంలో నిగ్రహంతోనే ఉన్న రష్యా రాయబారి సెర్గీ.. నిరసనకారుల్ని ఉద్దేశించి ఏవిధంగానూ స్పందించలేదు. తన ముఖాన్ని తుడుచుకున్న ఆయన అక్కడ నుంచి ముందుకు వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సెర్గీ ఆండ్రీవ్‌.. ఈ విషయాన్ని ఖండిస్తూ పొలండ్‌లోని రష్యా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏటా మే 9న ‘విక్టరీ డే’ పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహించే రష్యా.. ఈ ఏడాది కూడా మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ వద్ద పరేడ్‌ను చేపట్టింది. ఓవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యా.. మాతృభూమిని కాపాడుకునేందుకు ఈ సైనిక చర్య తప్పలేదంటూ సమర్థించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని