Ukraine Crisis: పసుపు రంగు సూట్‌లో రష్యన్‌ వ్యోమగాములు.. ఆంతర్యమేంటి?

రష్యాకు చెందిన ముగ్గురు కాస్మోనాట్లు శనివారం వేకువజామున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారు పసుపు రంగు సూట్‌లలో ఐఎస్‌ఐఎస్‌లోకి ప్రవేశించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది...

Updated : 19 Mar 2022 11:43 IST

మాస్కో: రష్యాకు చెందిన ముగ్గురు కాస్మోనాట్లు శనివారం వేకువజామున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి చేరుకున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న తొలి బృందం ఇదే కావడం గమనార్హం. అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్యన్ కాస్మోనాట్లు ఐఎస్‌ఎస్‌కు చేరుకునేటప్పటికి పసుపు రంగులో ఉన్న స్పేస్‌ సూట్‌ను ధరించి ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది.

పసుపు  రంగుతో సంఘీభావం..

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిపై సొంతదేశంలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఉక్రెయిన్‌ జాతీయ పతాకంలో ఉండే రంగుల్లో ఒకటైన పసుపు వర్ణపు దుస్తులు ధరించి ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాస్మోనాట్లు కూడా పసుపు రంగు ధరించడంపై చర్చకు తెరతీసింది.

కాస్మోనాట్‌ చెప్పిన వివరణ ఇదీ..

ముగ్గురు కాస్మోనాట్లలో ఒకరైన ఒలెగ్‌ ఆర్టెమ్యెవ్‌ ఈ విషయంపై స్పందించారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న తర్వాత భూమిపై ఉన్న తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఆయన బదులిచ్చారు. ‘‘ప్రతి కాస్మోనాట్‌ బృందం ఒక్కో రంగు సూట్‌ను ఎంపిక చేసుకుంటుంది. అలా మేమూ ఓ రంగును ఎంచుకున్నాం. పైగా పసుపు రంగులో ఉన్న మెటీరియల్‌ అంతా పోగుపడింది. అందుకే దాన్ని వినియోగించుకోవాల్సి వచ్చింది. అలా మేం ఈ రంగు సూట్‌ ధరించాల్సి వచ్చింది’’ అని ఆర్టెమ్యెవ్‌ సమాధానం ఇచ్చారు.

అందుకు గుర్తుగానే కావొచ్చు..

అయితే, దీనిక వెనుక నిజమైన కారణం ఏంటన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. కానీ, అంతరిక్ష ప్రయోగాలను దగ్గరగా పరిశీలించే హార్వర్డ్‌ సెంటర్‌లో ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్‌ మెక్‌డోవెల్‌ ఓ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న ముగ్గురు కాస్మోనాట్లు బౌమన్‌ మాస్కో స్టేట్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ నుంచి వచ్చినవారని.. ఆ విశ్వవిద్యాలయానికి చెందిన రంగు సూట్లనే ధరించి ఉంటారని వివరించారు. తొలి బౌమన్‌ రోదసీ బృందంగా తమని గుర్తుపెట్టుకునేలా అది ధరించి ఉంటారని తెలిపారు. మరో అంతరిక్ష నిపుణుడు మాట్లాడుతూ.. రోదసీ యాత్రల్లో వినియోగించే సూట్లను చాలా రోజుల ముందే తయారు చేస్తారని తెలిపారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు దానికి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

రష్యన్‌ స్పేస్‌ కార్పొరేషన్‌ రాస్‌కాస్మోస్‌కు చెందిన కాస్మోనాట్లు ఒలెగ్‌ అర్టెమ్యెవ్‌, డెనిస్‌ మట్వెయెవ్‌, సెర్గీ కొర్సకోవ్‌ కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్‌ నుంచి శనివారం సాయంత్రం బయలుదేరారు. సోయుజ్‌ ఎంఎస్‌-21లో రాకెట్‌లో వెళ్లిన వారు దాదాపు మూడు గంటల్లో స్పేస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఇద్దరు రష్యన్లు, నలుగురు అమెరికన్లు, ఓ జర్మన్‌ బృందంలో వీరు చేరారు.

అంతరిక్షానికీ యుద్ధం సెగ..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత పలు స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రయోగాలు, అంతరిక్ష ఒప్పందాలు రద్దయ్యాయి. ఇకపై అమెరికా రోదసీలోకి ‘చీపుర్ల’పై వెళ్లనుందంటూ రాస్‌కాస్మోస్‌ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌ ఎద్దేవా చేశారు. యూఎస్‌కు రాకెట్‌ ఇంజిన్ల సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దశాబ్దాల అంతరిక్ష భాగస్వామ్యాల తెగతెంపుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు నిపుణులు వాపోయారు. ముఖ్యంగా అంతరిక్ష కేంద్రంలో జరుగుతున్న ప్రయోగాలు నిలిచిపోతాయని హెచ్చరించారు.

మరోవైపు నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌.. రోగోజిన్‌ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. చివరకు అమెరికాతో రష్యా కలిసి పనిచేయక తప్పదని వ్యాఖ్యానించారు. అంతరిక్షం విషయానికి వస్తే మాత్రం సహకారం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 340 రోజులు పాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉండి రికార్డు నెలకొల్పనున్న అమెరికా ఆస్ట్రోనాట్‌ ‘మార్క్‌ వండే హీ’ మరో ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములతో కలిసి మార్చి 30న సోయుజ్‌లో కజఖ్‌స్థాన్‌లో దిగనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని