Updated : 12 Apr 2022 11:38 IST

Ukraine Crisis: అత్యాచారమే ఆయుధంగా.. !

ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సేనల దురాగతాలు.. తోసిపుచ్చిన మాస్కో

న్యూయార్క్: పక్కగదిలో బిడ్డ ఏడుస్తున్నా, తల్లిపై సామూహిక అత్యాచారం.. పదేళ్ల చిన్నారులనూ వదలని క్రూరత్వం.. అందుకే వారి నుంచి తప్పించుకునేందుకు జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు.. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న మారణహోమంలో ఇలా ఎన్నో అమానవీయ ఘటనలు బయటకువచ్చాయి. పుతిన్‌ సేనల తీరుతో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. వీటిని అంతర్జాతీయ సమాజంతో పాటు, ఉక్రెయిన్ మానవహక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రస్తుతం ఐరాస భద్రతామండలి ఈ దుశ్చర్యల గురించి ఇరు దేశాల వాదనలు వింటోంది.

‘రష్యా సైనికులు పాల్పడుతోన్న దారుణాలపై మా సంస్థకు 9 ఫిర్యాదులు వచ్చాయి. 12 మంది మహిళలు, బాలికలపై అత్యాచారం, లైంగిక దాడి జరిపినట్లు బాధితులు వెల్లడించారు. మొత్తం నేరాల్లో బయటకు వచ్చిన ఈ సంఖ్య చాలా చాలా తక్కువ. రష్యన్ దురాక్రమణదారులు హింస, అత్యాచారాలను యుద్ధ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని మాకు తెలుసు. అది మాకు కనిపిస్తోంది. మీరు మా ఆవేదన వినాలని కోరుకుంటున్నాం’ అంటూ లా స్ట్రాడా అనే మానవ హక్కుల సంస్థ ప్రెసిడెంట్ కేథరినా ఐరాసలో వెల్లడించారు. అయితే ఆ ఆరోపణలను రష్యా ఖండించింది. ‘ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలు.. రష్యా సైనికులను శాడిస్టులు, రేపిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఐరాసలో ఆ దేశ ప్రతినిధి తోసిపుచ్చారు. 

ఇదిలా ఉండగా.. రష్యా దాడితో వెలుగుచూస్తోన్న ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస అధికారులు పిలుపునిచ్చారు. అలాగే యుద్ధభూమిలో చిక్కుకుపోయిన చిన్నారులను రక్షించాల్సిన ఆవశ్యకతను చాటారు. ‘అత్యాచారం, లైంగిక దాడి ఘటనల గురించి ఎక్కువగా వింటున్నాం. జవాబుదారీతనం, న్యాయం కోసం వీటిపై దర్యాప్తు జరగాలి. తక్షణం ఈ యుద్ధం ఆగాలి’ అని ఐరాసకు చెందిన మహిళా ఏజెన్సీ డైరెక్టర్ సిమా బహౌస్ డిమాండ్ చేశారు. 

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రకటించిన దగ్గరి నుంచి ఎన్నో కలచివేసే దృశ్యాలు, ఘటనల్ని ఈ ప్రపంచం చూసింది. కీవ్ సమీపంలో బుచా పట్టణం అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. రష్యా తన సేనల్ని ఉపసంహరించుకున్న తర్వాత అక్కడకు వెళ్లినవారికి ఆ ప్రాంతమంతా మరుభూమిగా కనిపించింది. ఇప్పటికీ పుతిన్ సేనలు విధ్వంసం సృష్టిస్తోన్న మేరియుపొల్‌ నగరం ఎలా ఉంటుందోనని ఉక్రెయిన్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. మరోవైపు.. తాము పలుమార్లు చెప్పినట్లుగానే పౌరసమాజంపై రష్యా యుద్ధం చేయదని అక్కడి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ఉక్రెయిన్ రెచ్చగొట్టే చర్యల్లో భాగమనేనని పుతిన్‌ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కానీ వాస్తవాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. అయితే ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారం ఉండటంతో దర్యాప్తునకు ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని