MQ-9 Reaper: అడ్డుపడటం వల్లే అలా జరిగింది.. లేదు అదే కూలిపోయింది..

నల్లసముద్రంపై నిఘా నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన డ్రోన్‌ కూలిపోవడంపై అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం రెండు దేశాలు మధ్య నేరుగా ఘర్షణలు రావడం ఇదే తొలిసారి.

Updated : 15 Mar 2023 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దండయాత్రలో తాజాగా జరిగిన ఉదంతంతో అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు శిఖరస్థాయికి చేరాయి. నల్లసముద్రంపై  అంతర్జాతీయ జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న ఎంక్యూ రీపర్‌ 9 డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు అడ్డుపడటంతో డ్రోన్‌ సముద్ర జలాల్లో కూలిన విషయం తెలిసిందే.

చమురును కుమ్మరించాయి..

రష్యా సరిహద్దుకు దూరంగా గస్తీ నిర్వహిస్తున్న రీపర్‌ డ్రోన్‌పై రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు ఇంధనాన్ని కుమ్మరించాయి. అనంతరం డ్రోన్‌ ప్రొపెల్లర్‌ను ఢీకొనడంతో డ్రోన్‌ సముద్రంలో కూల్చేసుకున్నామని అమెరికా పేర్కొంది. రష్యన్‌ పైలట్లు ఎలాంటి అవగాహన లేకుండా డ్రోన్‌ను అడ్డుకున్నారని అమెరికా సంయమనం పాటించకుంటే రెండు రష్యా విమానాలు నేలకూలిండేవని అమెరికా వాయుసేన అధికారులు పేర్కొన్నారు. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న అనంతరం నల్లసముద్రంపై రష్యా వాయుసేన రాకపోకలు ఎక్కువయ్యాయి.  అయితే తాము రష్యా గగనతలంలోకి రాలేదని గత సంవత్సర కాలంగా అంతర్జాతీయ గగనతలంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది.

మా సరిహద్దుల్లోకి డ్రోన్‌ ప్రవేశించింది..

అయితే అమెరికా ప్రకటనను రష్యా అధికారవర్గాలు ఖండించాయి. తమ సరిహద్దుల్లోకి రావడంతో రెండు యుద్ధవిమానాలు దానిని అడ్డుకునేందుకు యత్నించాయని తెలిపారు. అయితే ఈ క్రమంలో డ్రోన్‌ కూలిపోయిందని రష్యా విమానాలు ఎలాంటి ఇంధనాన్ని కుమ్మరించలేదని వెల్లడించింది. 

ఎంక్యూ రీపర్‌ అంటే..

అమెరికా అమ్ముల పొదిలోని అధునాతమైన డ్రోన్‌ ఇది. నిఘాతో పాటు దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం.  రిమోట్‌ ద్వారా పనిచేసే ఈ డ్రోన్‌ దాదాపు 11 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తు, 2,200 కిలోల బరువు కలిగివుంటుంది. 24 గంటలు ఎగరడంతో పాటు2400 కి.మీ. మేర నిఘా నిర్వహించగలదు. 2007లో దీన్ని అమెరికా వాయుసేనలో ప్రవేశపెట్టారు.

గతంలోనూ ఇలాంటి ఉదంతాలు..

* ప్రపంచంలో పెద్దదేశాలైన అమెరికా-రష్యాల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంటాయి. 2020లో అమెరికా బి-52 బాంబర్‌ నల్లసముద్ర గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో రష్యన్‌ విమానాలు అత్యంత సమీపానికి వచ్చాయి. కేవలం 100 అడుగుల సమీపంలో రావడం గమనార్హం. 

* 2021లో నల్లసముద్రంలో అమెరికా సైనిక విన్యాసాల సమయంలో అమెరికా యుద్ధనౌక డొనాల్డ్‌ కుక్‌కు సమీపంలోకి రష్యా వాయుసేన విమానాలు వచ్చాయి. 

* గత ఏడాది అలస్కా మీదుగా వెళుతున్న  రెండు రష్యా యుద్ధవిమానాలను అమెరికా యుద్ధ విమానాలు కాసేపు అనుసరించాయి.

మన దగ్గరా ఆ డ్రోన్లు ఉన్నాయి..

రీపర్‌ డ్రోన్లు యుద్ధతంత్రంలో కీలకపాత్ర పోషిస్తాయి. నిఘాతో పాటు దాడులు చేయగలదు. పైలట్ రహిత ఈ డ్రోన్లకు పలు రకాల ఆయుధాలను అమర్చి నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యముంది. 2017లో వీటిని కొనుగోలు చేసేందుకు భారత్‌-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని డ్రోన్లు భారత్‌కు చేరగా సముద్రజలాలపై నిఘాకు వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లకు హంటర్‌ కిల్లర్‌ అనే పేరు కూడా ఉంది. శత్రువులు ఎక్కడ ఉన్నా వెతికి మట్టుబెడుతుంది. అందుకనే ఈ పేరు వచ్చింది.  అఫ్ఘన్‌లో సైనికచర్యలో భాగంగా అమెరికా పలుసార్లు ఈ డ్రోన్‌ను వినియోగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని