Ukraine crisis: ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా మళ్లీ క్షిపణుల వర్షం!

ఉక్రెయిన్‌పై దాడుల్ని రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. తాజాగా మరోసారి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు యుద్ధం తొలినాళ్లలో .....

Published : 29 Jun 2022 02:38 IST

షాపింగ్‌ మాల్‌పై దాడిలో 18కి చేరిన మృతుల సంఖ్య

కీవ్‌: ఉక్రెయిన్‌పై దాడుల్ని రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. తాజాగా మరోసారి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు యుద్ధం తొలినాళ్లలో యత్నించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన రష్యా ఇప్పుడు మళ్లీ రాజధాని సహా పలు నగరాలపై క్షిపణుల్ని గురిపెట్టి సామాన్యుల ప్రాణాల్ని బలితీసుకుంటోంది. ఆదివారం తెల్లవారు జామున కీవ్‌పై 14 క్షిపణుల్ని ప్రయోగించిన పుతిన్‌ సేనలు.. సోమవారం కూడా పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్‌చుక్‌ నగరంలో రద్దీగా ఉండే ఓ షాపింగ్‌ మాల్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 18కి చేరగా.. 59మందికి పైగా  గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌ స్టేట్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ అదిపతి సెర్గీ క్రుక్‌ మాట్లాడుతూ.. గాయపడిన వారిలో 25మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. క్షిపణి దాడులతో అగ్నికీలలు 10,300 చదరపు మీటర్ల వరకు విస్తరించాయని వివరించారు. మరోవైపు, ఈ ఘటన తర్వాత 36మంది పౌరుల ఆచూకీ తెలియడంలేదని పొల్టావా ప్రాంత గవర్నర్‌ దిమిత్రో లునిన్‌ తెలిపారు.

ఇంకోవైపు, ఒచాకివ్‌ నగరంలోని ఈరోజు తెల్లవారు జామున 4గంటల సమయంలో రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సిటీ మార్కెట్‌, కమ్యూనిటీ సెంటర్‌, నివాస భవనాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు మైకోలైవ్‌ గవర్నర్‌ ఒలెక్సాండర్‌ సింకేవిచ్‌ తెలిపారు.  అలాగే, ఓ చిన్నారితో పాటు ఆరుగురు గాయపడ్డారని వివరించారు.

యుద్ధంలో 4700మంది ఉక్రెయిన్‌ పౌరులు మృతి

ఫిబ్రవరి 28న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు 4,731మంది ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెందగా.. మరో 5,900మంది గాయపడినట్టు ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్‌ వెల్లడించారు. ఈ దాడుల్లో 330మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 489మంది గాయపడినట్టు పేర్కొన్నారు.

35వేల మంది రష్యా సైనికుల్ని మట్టుబెట్టాం: ఉక్రెయిన్‌

తమ దేశంపై దండెత్తిన రష్యాను తిప్పికొట్టి తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు ఉక్రెయిన్‌ చెబుతోంది. ఇప్పటివరకు 35వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుబెట్టామని ప్రకటించుకుంది. అలాగే, 1,567 యుద్ధ ట్యాంకులు, 3704 సాయుధ శకటాలు, 217 విమానాలు, 185 హెలికాప్టర్లు 14 నౌకలు, 139 క్రూజ్‌ మిసైళ్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని