Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్‌ ‘పాప్‌స్టార్‌’ మృతి

ఉక్రెయిన్‌పై (Ukraine) దురాక్రమణ చేస్తోన్న పుతిన్‌పై (Vladimir Putin) విమర్శలు గుప్పించే ఓ రష్యన్‌ గాయకుడు (Russian Popstar) ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చోటుచేసుకున్న ఓ నది ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తెలిసింది.

Published : 23 Mar 2023 01:38 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై (Ukraine) దురాక్రమణ మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin)పై సొంత దేశంలోనే విమర్శలు వచ్చాయి. సైనికుల కుటుంబీకుల మొదలు సెలబ్రిటీలు కూడా పుతిన్‌ చర్యపై వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా చర్చనీయాంశమయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పుతిన్‌పై తన పాటలతో వ్యతిరేక గళాన్ని వినిపించిన ఓ రష్యన్‌ పాప్‌స్టార్‌ (Russian Popstar) తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు ఓ నదిని దాటుతున్న సమయంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

దిమా నోవా (35) అసలు పేరు దిమిత్రి విర్గినోవ్‌. క్రీమ్‌సోడా అనే మ్యూజిక్‌ సంస్థను నడుపుతున్నాడు. మార్చి 19న నోవా తన సోదరుడు సహా ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డకట్టిన వోల్గా నది వద్దకు వెళ్లారు. మంచు నదిని దాటుతున్న క్రమంలో అందులో పడిపోయారు. స్నేహితుల్లో ఇద్దర్ని రక్షించగా.. దిమాతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు క్రీమ్‌సోడా వెల్లడించింది.

పాప్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న దిమా నోవా.. ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధానికి వ్యతిరేకంగా తన పాటలు, సంగీతం ద్వారా నిరసన తెలపడం మొదలుపెట్టాడు. అందులో అక్వా డిస్కో అనే పాట ఎంతో ఆదరణ పొందడంతోపాటు వివాదాస్పదం కూడా అయ్యింది. కేవలం యుద్ధానికి సంబంధించినవే కాకుండా పుతిన్‌కు చెందిన ఆస్తులపైనా నోవా విమర్శలు గుప్పించేవాడు. పుతిన్‌కు సుమారు రూ.10వేల కోట్ల విలువైన ఖరీదైన భవనం ఉందంటూ విమర్శలు చేశాడు. ఇలా వరుస విమర్శలతో దిమా నోవా ఎంతో పాపులర్‌ అయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని