Putin: అది అతిపెద్ద తప్పిదమే అవుతుంది.. దక్షిణ కొరియాకు పుతిన్‌ హెచ్చరిక

ఒకవేళ ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందజేయాలని దక్షిణ కొరియా నిర్ణయిస్తే.. ఆ దేశం అతిపెద్ద తప్పిదం చేసినట్లవుతుందని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించారు.

Updated : 21 Jun 2024 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సైనిక సహకార ఒప్పందంపై మండిపడ్డ దక్షిణ కొరియా.. మాస్కోపై పోరాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాల అందజేతపై ఆలోచన చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇదే పనిచేస్తే సియోల్‌ అతిపెద్ద తప్పిదం చేసినట్లవుతుందని రష్యా అధినేత పుతిన్ (Vladimir Putin) తాజాగా హెచ్చరించారు. తమపై దాడుల కోసం కీవ్‌కు యుద్ధ సామగ్రి సరఫరా చేయాలని నిర్ణయించుకుంటే.. ఆ దేశానికి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వియత్నాం పర్యటనలో భాగంగా పుతిన్‌ విలేకరులతో మాట్లాడారు. అమెరికా, దాని మిత్రదేశాలు కీవ్‌కు ఆయుధాల సరఫరా కొనసాగిస్తే.. తామూ ప్యాంగాంగ్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

‘ఈసారి నేను మౌనంగా ఉండలేను..’: మిలిందా గేట్స్‌ ఆసక్తికర పోస్ట్‌

‘‘ఉక్రెయిన్‌కు యుద్ధ సామగ్రి అందిస్తున్న వారు మాతో యుద్ధంలో లేరని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తదితర దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే హక్కు మాకూ ఉంది’’ అని పుతిన్ అన్నారు. దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ.. కీవ్‌కు ఆయుధాలను సరఫరా చేసే విషయమై వివిధ అవకాశాలను పరిశీలిస్తామని మరోసారి తెలిపింది. ఈ వ్యవహారాన్ని రష్యా ఎలా చక్కదిద్దుతుందనే దానిపై ఆధారపడి తమ వైఖరి ఉంటుందని పేర్కొంది. అంతకుముందు.. తమ దేశంలోని మాస్కో రాయబారిని పిలిపించిన దక్షిణ కొరియా.. ప్యాంగాంగ్‌తో సైనిక సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు.. ఉత్తర కొరియా బలగాలు సరిహద్దు దాటి వచ్చాయని, హెచ్చరిక కాల్పులు జరపడంతో వెనక్కి తగ్గాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని