Vladimir Putin: హత్యాయత్నం నుంచి తప్పించుకొన్న పుతిన్‌..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది. దానిని దాటుకొని ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

Published : 25 May 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది. దానిని దాటుకొని ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు నెలల క్రితం పుతిన్‌ ఓ దాడి నుంచి తప్పించుకొన్నట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి కైర్‌యలో బుద్‌నోవ్‌ స్కైన్యూస్‌తో మాట్లాడుతూ వెల్లడించినట్లు ఉక్రెయినిస్కా ప్రావడా వెల్లడించింది. 

 కాకసస్‌ పర్యటనలో ఉన్న సమయంలో అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్లు బుద్‌నోవ్‌ పేర్కొన్నారు. ఈ దాడి నుంచి పుతిన్‌ సురక్షితంగా తప్పించుకొన్నారని వివరించారు. నల్లసముద్రం, కాస్పియన్‌ సముద్రం మధ్య ఉన్న ప్రాంతాలను కాకసస్‌ అని పిలుస్తారు.  బుదనోవ్‌ కచ్చితంగా ఆ ప్రాంతం పేరు మాత్రం వెల్లడించలేదు. కాకపోతే ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైన తొలినాళ్లలోనే ఈ దాడి చోటు చేసుకొన్నట్లు వివరించారు. ఈ విషయాన్ని రష్యాలో వీలైనంత రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారన్నారు. పుతిన్‌కు ఆగస్టు మధ్య నుంచి వ్యతిరేక పవనాలు వీయవచ్చని.. ఈ ఏడాది చివరి నాటికి క్రెమ్లిన్‌లో తిరుగుబాటు జరిగి ఆయన్ను పదవి నుంచి తప్పించవచ్చని అంచనావేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైపోయిందన్నారు. 

పుతిన్‌ తన కడుపులో చేరిన ద్రవాలను తొలగించుకొనేందుకు శస్త్రచికిత్స చేయించుకొన్నట్లు వార్తలు వస్తున్న సమయంలో ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతి ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్‌ ఆరోగ్యం పై గత కొన్నాళ్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా ఒలిగార్క్‌ ఒకరు  పుతిన్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌ ఉందని వెల్లడించారు.  

గతంలో ఐదు హత్యాయత్నాల నుంచి తప్పించుకొని..

పుతిన్‌పై 2017 నాటికి ఐదు హత్యాయత్నాలు జరిగాయి. ఈ విషయాన్ని 2017లో ఓలివర్‌ స్టోన్‌ అనే డైరెక్టర్‌తో మాట్లాడుతూ స్వయంగా పుతినే వెల్లడించారు. కానీ, తాను వాటి గురించి ఆందోళన చెందనని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని