Ukraine Crisis: పదేళ్ల చిన్నారులనూ వదిలిపెట్టని రష్యా సైన్యం..?

బుచాతో పాటు సమీప పట్టణాల్లో కనిపిస్తోన్న దృశ్యాలు రష్యా సైనికుల దారుణాలకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి.

Published : 04 Apr 2022 14:33 IST

రష్యా సైనికుల ఆకృత్యాలపై ఉక్రెయిన్‌ మహిళా ఎంపీల ఆగ్రహం

కీవ్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యా సేనలు.. అక్కడ మారణకాండకు పాల్పడుతున్నాయనే విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. భీకర దాడులతో ప్రధాన నగరాలను నాశనం చేస్తోన్న రష్యా సైన్యం మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బుచాతో పాటు సమీప పట్టణాల్లో కనిపిస్తోన్న దృశ్యాలు రష్యా సైనికుల దారుణాలకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి. పదేళ్ల బాలికలపై అత్యాచారాలకు పాల్పడడమే కాకుండా మహిళల శరీరాలపై ప్రత్యేక ఆకారాల్లో తీవ్ర గాయాలు చేశారనే వార్తలు కలచివేస్తున్నాయి. రష్యా బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత బుచాలో పర్యటించిన ఉక్రెయిన్‌ మహిళా ఎంపీలు.. అక్కడి పరిస్థితులను వివరిస్తూ నిర్ఘాంతపోతున్నారు.

రష్యా సైనికులు దోపిడీలు చేస్తుండడమే కాకుండా మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి ప్రాణాలు తీశారు. పదేళ్ల చిన్నారులను కూడా వదలలేదు. మహిళల శరీరాల వెనుకభాగంగా ప్రత్యేక గుర్తులతో (స్వస్తిక్‌ ఆకారంలో) తీవ్రంగా గాయపరిచారు. ఈ ఆకృత్యాలకు పాల్పడింది రష్యా సైనికులే. అలాంటి వారిని రష్యా తల్లులు పెంచారు. అది నీతిలేని నేరస్థుల దేశం’ అంటూ రష్యా సేనల దారుణాలపై ఉక్రెయిన్‌ ఎంపీ లెసియా వాసిలెంకో మండిపడ్డారు. ‘ఆ దారుణ ఘటనలను చూసి నోటి మాట రావడం లేదు. ఆగ్రహం, భయం, ద్వేషంతో నా మనస్సు మొద్దుబారిపోయింది. ఈ మారణహోమాన్ని ఆపండి’ అని వేడుకొన్నారు. అత్యాచారం చేసి చంపినట్లుగా భావిస్తోన్న మహిళ ఫొటోను పార్లమెంట్‌ సభ్యురాలు లెసియా వాసిలెంక్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

మేరియుపోల్‌లో ఇంకెంత విధ్వంసమో..?

బుచా నగరమే ఇలా ఉంటే, ఇక మేరియుపోల్‌లో ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో ఊహించలేనని ఉక్రెయిన్‌ మరో మహిళా ఎంపీ కిరా రుదిక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేరాలు కేవలం పుతిన్‌ మాత్రమే చేసినవి కావని.. ప్రతిఒక్క రష్యా సైనికుడు ఇందులో భాగస్వామేనని అన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన రష్యా ఎప్పటికైనా మూల్యం చెల్లిస్తుందని.. ఈ విషాదాన్ని మేమెన్నడూ మరచిపోమని కిరా రుదిక్‌ ఉద్ఘాటించారు.

కీవ్‌కు సమీపంలోని బుచా పట్టణాన్ని రష్యా బలగాలు విడిచి వెళ్లిన తర్వాత ఉక్రెయిన్‌ మహిళా ఎంపీలు ఆ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న దారుణ ఘటనలు చూసి నిర్ఘాంతపోతున్నారు. ముఖ్యంగా వీధుల్లో పేరుకుపోయిన శవాల దిబ్బలను చూసి చలించిపోతున్నారు. ముఖ్యంగా సామాన్య పౌరులను నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి కాల్చినట్లు భావిస్తోన్న దృశ్యాలు ప్రతిఒక్కరినీ కలచివేస్తున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని