ISS: రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ ఆ హెచ్చరికలు ఎందుకు చేశారంటే..?

ఉక్రెయిన్‌పై సైనిక దాడికి పాల్పడుతోన్న రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్‌ మండిపడిన విషయం తెలిసిందే.

Published : 01 Mar 2022 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై సైనిక దాడికి పాల్పడుతోన్న రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్‌ మండిపడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నిర్వహణలో సహకారాన్ని ఇవి దెబ్బతీస్తాయని పేర్కొంటూ.. ఆ అంతరిక్ష కేంద్రాన్ని ఎవరు నియంత్రిస్తారు?అని రోస్‌ కాస్మోస్‌ సంస్థ డైరెక్టర్‌ దిమిత్రి రోగోజిన్‌ ప్రశ్నించారు. దీన్ని భారత్‌, చైనాలపై పడేయాలనుకుంటున్నారా? అని కూడా హెచ్చరించారు.

దిమిత్రి ఈ హెచ్చరికలు ఎందుకు చేశారంటే..

ఐఎస్‌ఎస్‌ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను అందజేస్తోంది రష్యానే. ఐఎస్‌ఎస్‌లో ముఖ్యంగా రెండు కీలకమైన విభాగాలున్నాయి. ఇందులో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంటే.. మరొకదాన్ని రష్యా నిర్వహిస్తోంది. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్‌ సిస్టమ్స్‌లను యూఎస్‌ నిర్వహిస్తోంది. ఇక ఈ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది.

ఎందుకంటే ఐఎస్‌ఎస్‌ పూర్తిగా జీరో గ్రావిటీ స్పేస్‌లో లేదు. ఇది కొద్దిగా భూమి గురుత్వాకర్షణను ఎదుర్కొంటుంది. అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఇది కొంత శక్తిని కోల్పోతుంది. దాన్ని అలాగే వదిలేస్తే.. అది కూలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించేందుకు రష్యా థ్రస్టర్లను పంపుతుంది. ఇవి ఐఎస్‌ఎస్‌ను నిరంతరం నియంత్రిత కక్ష్యలో తిరిగేలా చేస్తాయి. అలాగే దానికి కావాల్సిన వేగాన్ని కూడా అందిస్తాయి.

ఐఎస్‌ఎస్‌ నిర్వహణలో రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. యూఎస్‌, ఇతర దేశాలు దానిని నియంత్రించలేవని రష్యా అంతరిక్ష సంస్థ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

మేమున్నామంటున్న మస్క్‌..

అయితే అంతరిక్ష కేంద్రానికి రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. తమ కంపెనీ రంగంలోకి దిగుతుందని స్పేస్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ హామీ ఇస్తున్నారు. వ్యోమగాములను, సరకులను ఐఎస్‌ఎస్‌కు తీసుకువెళ్తున్న అతిపెద్ద ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ ఇదే. పుతిన్‌ ప్రభుత్వం తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. తాము రంగంలోకి దిగి అవసరమైన ప్రొపెల్షన్‌ సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు.

అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గానూ 1998 నుంచి ఐఎస్‌ఎస్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2028 వరకూ దీని సేవలను ఉపయోగించుకోనున్నారు. దాదాపు 500 టన్నుల బరువుండే దీని నిర్వహణలో అమెరికా, రష్యానే కాకుండా 15కిపైగా దేశాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. ఫుట్‌బాల్‌ మైదానమంత పరిమాణంలో ఉండే ఈ భారీ మానవ నిర్మితం అంతరిక్షంలో గంటకు 28 వేల కిలో మీటర్ల వేగంతో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. అంటే గంటన్నరకొకసారి భూమిని ఇది చుట్టేస్తుంది. రోజుకు 16 సార్లు ఇలా తిరుగుతుంది. దానిలో ఎప్పుడూ ఆరుగురు వ్యోమగాములు ఉండి.. తమ పరిశోధనలు కొనసాగిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని