Ukraine: లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్‌పై భీకర దాడులు!

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్‌ సరఫరా లేకుండా పోయింది.

Published : 07 Jul 2024 00:06 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukraine)లోని విద్యుత్‌ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. దీంతో రష్యా సరిహద్దులోని సుమీ రీజియన్‌ అంధకారంలో చిక్కుకుపోయింది. స్థానికంగా లక్షకుపైగా ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు విద్యుత్‌ శాఖ వెల్లడించింది. డ్రోన్ల దాడుల కారణంగా సుమీ నగరంలో నీటి సరఫరాకు ఆటంకం కలిగినట్లు తెలిపింది. మరోవైపు.. దొనెట్స్క్‌ రీజియన్‌పై మాస్కో జరిపిన దాడుల్లో 11 మంది పౌరులు మృతి చెందారు. మరో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 70కిపైగా గ్లైడ్‌ బాంబులు, ఆరు రాకెట్లను మాస్కో ప్రయోగించిందని, 55 వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది.

బ్లూ లైన్‌లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన

దొనెట్స్క్‌లోని పోక్రోవ్స్క్‌లో భీకర పోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఇరుదళాలు శుక్రవారం 45 సార్లు ఘర్షణ పడ్డాయని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. చాసివ్‌ యార్‌ పట్టణంలో ముగ్గురు మరణించినట్లు చెప్పారు. తూర్పు దొనెట్స్క్‌ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంత శివార్ల నుంచి ఇటీవలే కీవ్‌ బలగాలు వెనక్కి మళ్లిన విషయం తెలిసిందే. మాస్కో దాడుల్లో ఈ పట్టణం పూర్తిస్థాయిలో ధ్వంసమైంది. సుమీలోని ఓ ఆయుధ కర్మాగారంపైనా పుతిన్‌ సేనలు దాడి చేశాయి. మరోవైపు రష్యాలోని బెల్గొరోడ్‌ రీజియన్‌లో ఉక్రెయిన్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు గాయపడ్డారు. కుర్స్క్‌, బెల్గొరోడ్‌లలో ఎనిమిది డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని