Ukraine Crisis: ఇప్పుడు రెండో దశ యుద్ధం మొదలైంది..!

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుందే తప్ప, తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విజయం సాధించలేకపోయిన పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌ తూర్పు భాగంలోని డాన్‌బాస్‌పై దృష్టిసారించాయి.

Updated : 19 Apr 2022 12:39 IST

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుందే తప్ప, తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విజయం సాధించలేకపోయిన పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌ తూర్పు భాగంలోని డాన్‌బాస్‌పై దృష్టిసారించాయి. అక్కడ రెండో దశ యుద్ధం ప్రారంభమైందని, అది కూడా భారీస్థాయిలో ఉందని కీవ్ వర్గాలు వెల్లడించాయి.

‘రష్యన్ దళాలు డాన్‌బాస్‌ కోసం రెండోదశ యుద్ధాన్ని ప్రారంభించాయని ఇప్పుడు ధ్రువీకరిస్తున్నాం. దీనికోసం వారు చాలాకాలంగా సిద్ధం అవుతున్నారు. ఈ దురాక్రమణ నిమిత్తం భారీస్థాయిలో రష్యా సైనికులను ఇక్కడ మోహరించారు. ఇక్కడకు ఎంతమంది సైనికులు వచ్చారన్నదానితో సంబంధం లేకుండా.. మేం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మమ్మల్ని మేం రక్షించుకుంటాం’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ టెలిగ్రాంలో పోస్టు పెట్టారు. 

జెలెన్‌స్కీకి ముందు తూర్పు లుగాన్స్క్‌ ప్రాంత గవర్నర్ సెర్గీ గైడే కూడా రష్యా దాడి గురించి వెల్లడించారు. ‘ఇది నరకం. మేం వారాలుగా మాట్లాడుకుంటోన్న యుద్ధం ప్రారంభమైంది. రూబిజ్నే, పోపస్నాలో నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రశాంత నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది’ అని ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు. కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ సైనిక కాన్వాయ్ తర్వాత అక్కడ నుంచి ఉపసంహరించుకుంది. తర్వాత డాన్‌బాస్‌ ప్రాంతంపై తిరిగి దృష్టి సారించింది. ఆ ప్రాంతాన్ని 2014 నుంచి రష్యా అనుకూల వేర్పాటువాదులు పాక్షికంగా నియంత్రిస్తున్నారు. 

బుచా దారుణాలకు పాల్పడిన బ్రిగేడ్‌కు పుతిన్ ప్రశంస..

బుచా పట్టణంలో రష్యా సైన్యం మారణహోమానికి పాల్పడినట్లు ఉక్రెయిన్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన దృశ్యాలను వెలుగులోకి తేగా.. ప్రపంచమంతా తీవ్ర ఆవేదనకు గురైంది. రష్యా సైన్యం ఆకృత్యాలను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. అయితే అక్కడ హింసాకాండకు పాల్పడిన బ్రిగేడ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నుంచి గౌరవం దక్కింది. మాతృభూమి, దేశ ప్రయోజనాలను రక్షించేందుకు పోరాటం చేశారంటూ ఆయన సంతకం చేసిన ఉత్తర్వును ఆ బ్రిగేడ్ అందుకుంది. అలాగే గార్డ్స్‌ అనే బిరుదును పొందింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని