Ukraine: రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో నేటి నుంచి రెఫరెండం మొదలు..!

ఉక్రెయిన్‌పై దాడి చేసి రష్యా ఆక్రమించుకొన్న ప్రదేశాల్లో నేటి నుంచి రెఫరెండం మొదలైంది. ఈ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడానికి స్థానికులు సానుకూలత

Published : 23 Sep 2022 13:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై దాడి చేసి రష్యా ఆక్రమించుకొన్న ప్రదేశాల్లో నేటి నుంచి రెఫరెండం మొదలైంది. ఈ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడానికి స్థానికులు సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రపంచానికి చూపేందుకు ఈ చర్యను చేపట్టింది. ఈ రెఫరెండం మంగళవారం ముగియనుందని వార్తాసంస్థల్లో కథనాలు వెలువడుతున్నాయి. తూర్పు వైపు దొనెట్స్క్‌, లుహాన్స్క్‌.. దక్షిణం వైపు ఖేర్సన్‌, జపోరిజియాల్లో రష్యా సైన్యం పర్యవేక్షణలో దీనిని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌ సహా పశ్చిమ దేశాలు ఈ చర్యను భూకబ్జాగా అభివర్ణిస్తున్నాయి. ఇదొక సిగ్గుమాలిన చర్య అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మండిపడ్డారు. దాదాపు 3,00,000 మంది రిజర్వు దళాలను సమీకరిస్తామని రష్యా  అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించిన రోజుల వ్యవధిలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం గమనార్హం.

మరోపక్క ఉక్రెయిన్‌ దళాలు ఖేర్సాన్‌లో తీవ్ర ప్రతిఘటన చేస్తున్నాయి. ఈశాన్య ఖేర్సాన్‌లో చాలా భూభాగాలను ఇప్పటికే రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ఈ ఎదురుదెబ్బలను తట్టుకొనేందుకు వీలుగానే దళాల పాక్షిక సమీకరణకు పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం అయినట్లు ప్రకటిస్తే ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టం. ఈ ప్రాంతాలపై దాడిని రష్యాపై దాడిగా పేర్కొంటూ మాస్కో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత 2014లో కూడా రష్యా ఇలాంటి రెఫరెండం నిర్వహించింది. దీనిలో 96.7శాతం మంది దీనికి అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. కానీ, దీనిపై రష్యా మానవహక్కుల సంఘం రూపొందించిన ఒక నివేదిక లీకైంది. దానిలో కేవలం 30శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారని.. వారిలో కూడా సగం మంది మాత్రమే మద్దతు ఇచ్చారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని