Ukraine Crisis: అట్లుంటది.. అలెగ్జాండర్‌ వ్యూహం..!

పుతిన్‌ ఉక్రెయిన్‌పై దాడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి ప్రధాన కారణం డాన్‌బాస్‌ ప్రాంతం. మాస్కో దళాలు ఇక్కడ నిలకడగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతున్నాయి. సైనిక చర్య తొలిరోజుల్లో

Updated : 30 May 2022 12:32 IST

ఉక్కు గుండ్ల వర్షంతో ఉక్కిరిబిక్కిరి.. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్‌ దాడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌పై దాడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి ప్రధాన కారణం డాన్‌బాస్‌ ప్రాంతం. మాస్కో దళాలు ఇక్కడ నిలకడగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతున్నాయి. సైనిక చర్య తొలిరోజుల్లో మాదిరిగా అన్నిప్రాంతాలపై ఒకేసారి దాడి చేయకుండా.. ఒక్కో ప్రాంతాన్ని చుట్టుముట్టి అక్కడి నుంచి ఉక్రెయిన్‌ సేనలను బయటకు పంపి ఆక్రమించుకొంటూ వస్తున్నాయి. తాజాగా  సీవియెరోదొనెట్స్క్‌ ప్రాంతంపై క్రెమ్లిన్‌ దృష్టిపెట్టింది. డాన్‌బాస్‌ నుంచి ఉక్రెయిన్‌ సేనలను పూర్తిగా తరిమి కొడతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ప్రకటించారు. ఈ క్రమంలో యుద్ధం మొదట్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా రష్యా నిలకడగా ముందుకు వెళుతోంది. సిరియాలో నిర్దాక్షిణ్యంగా దాడులు చేయించిన రష్యన్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ డాన్‌బాస్‌లో అనుసరిస్తోన్న వ్యూహమిది..!

ఉక్కు గుండ్ల వర్షం..

ఉక్రెయిన్‌పై సైనిక చర్య తొలినాళ్లలో రష్యా పెద్దగా పురోగతి సాధించకపోగా.. భారీగా ట్యాంకులను నష్టపోయి అభాసుపాలైంది. ఆ తర్వాత డాన్‌బాస్‌ ప్రాంతంలో విజయం సాధించడానికి ఓ ఎత్తుగడను సిద్ధం చేసింది. భారీ శతఘ్నులను ఉపయోగించి డాన్‌బాస్‌ ప్రాంతంలో లక్ష్యంగా చేసుకొన్న ప్రదేశంపై నిరంతరం ఉక్కు గుండ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. దీంతో ఉక్రెయిన్‌ సైనిక దళాలు భారీ ప్రాణనష్టం చవిచూడటంతో.. ఆ షెల్లింగ్‌కు తట్టుకోలేక ఆ ప్రాంతాలను వీడుతున్నాయి.

సాధారణంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దళాల్లో మృతుల సంఖ్యను చాలా అరుదుగా మాత్రమే చెబుతారు. కానీ, ఇటీవల ఆయన మాట్లాడుతూ డాన్‌బాస్‌లో జరిగిన దాడిలో 100 మంది వరకు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కన నెలకు 3,000 మంది చనిపోయే అవకాశం ఉంది. అంతేకాదు.. గాయపడిన వారి సంఖ్య అంతకు నాలుగింతలు ఉండొచ్చు. డాన్‌బాస్‌ రక్షణకు 30,000 దళాలను ఉక్రెయిన్‌ మోహరించింది. ఆ తర్వాత మరికొందరు వచ్చి చేరారు. ఈ ప్రకారం చూస్తే కీవ్‌ సేనలు భారీగా దెబ్బతిన్నట్లే చెప్పుకోవాలి.

‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వార్‌ ఆన్‌ స్టడీ’ ప్రకారం మే మొదటి వారంతో పోలిస్తే ఇటీవల రష్యా దళాలు నిలకడగా భూభాగాలను స్వాధీనం చేసుకొంటున్నాయి. సీవియెరోదొనెట్స్క్‌ వైపు నిలకడగా కదులుతూ.. మార్గమధ్యంలో గ్రామాలను ఆక్రమిస్తున్నాయి. సీవియెరోదొనెట్స్క్‌పై రష్యా దళాలు నిర్దాక్షిణ్యంగా షెల్లింగ్‌ చేస్తున్నాయని లుహాన్స్క్‌ గవర్నర్‌ షెర్లీ హైడై తెలిపారు. ఆయన అంచనా ప్రకారం 10,000 మంది రష్యా సైనికులు, 2,500 భారీ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే లుహాన్స్క్‌లో 95శాతం రష్యా స్వాధీనంలోకి వెళ్లిపోయింది.

సోవియట్‌ వార్‌ డైరీలో వ్యూహమే..

సోవియట్‌ సైన్యం అనుసరించిన ‘కాల్డ్రోన్‌’ వ్యూహాన్నే ఇప్పుడు రష్యా సేనలు అమలు చేస్తున్నాయి. ఈ వ్యూహాంలో భాగంగా మాస్కో దళాలు శత్రు సేనలను చుట్టుముడతాయి. అదే సమయంలో సరఫరాలు, ఇతర మద్దతును అడ్డుకొంటాయి. ఆ తర్వాత వాటితో నేరుగా తలపడకుండా దాడులు చేస్తాయి.  మొదట్లో శత్రుసేనలు ఎదురు దాడులు చేసినా.. ఆ తర్వాత మెల్లగా అలసిపోయి లొంగిపోవడమో, పారిపోవడమో చేస్తాయి.

చిన్నచిన్న లక్ష్యాలను స్వాధీనం చేసుకొంటూ.. 

తాజాగా డాన్‌బాస్‌లో రష్యా ఈ వ్యూహామే అనుసరిస్తోందని ‘ది గార్డియన్‌’ కథనం పేర్కొంది. తొలుత భారీ స్థాయి లక్ష్యాలను చుట్టుముట్టగా.. తాజాగా చిన్న లక్ష్యాలను చుట్టుముట్టి స్వాధీనం చేసుకొంటోంది. ఈ విషయాన్ని రష్యా అనుకూల వేర్పాటు వాద దళాల నాయకుడు ఎడ్వర్డ్‌ బుసురిన్‌ కూడా ధ్రువీకరించారు. ఒకేసారి పెద్ద ప్రాంతాన్ని చుట్టుముట్టే కంటే.. చిన్న చిన్న ప్రాంతాలను చుట్టుముట్టి వాటికి సరఫరాలు, ఇతర సహాయాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. 

సిరియా, గ్రాజ్ని అనుభవాలతో..

సిరియా యుద్ధంలో ‘బుచర్‌ ఆఫ్‌ సిరియా’గా పేరుగాంచిన అలెగ్జాండర్‌ దివొర్నికొవ్‌ ఈ దాడులకు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన చెచెన్‌ యుద్ధంలో మోటార్‌ రైఫిల్‌ డివిజన్‌కు కమాండర్‌గా వ్యహరించారు. అప్పట్లో గ్రాజ్ని నగరం మొత్తాన్ని కుప్పకూల్చేశారు. ఇప్పుడు దివొర్నికొవ్‌ అదే వ్యూహం ఇక్కడ పునరావృతం చేస్తున్నారు.

కీవ్‌, ఇతర ఉక్రెయిన్‌ నగరాలను దక్కించుకోవడంలో రష్యా పెద్దగా పురోగతి సాధించలేదు. దీనికి లాజిస్టిక్స్‌లో సమస్యలు కూడా తోడయ్యాయి. రష్యా సైనికుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఈ పరిస్థితుల్లో దివొర్నికోవ్‌ కనుసన్నల్లో మొత్తం ఆపరేషన్‌ జరిగేలా బాధ్యతలు అప్పగించారు. ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడంలో కూడా అతడికి అద్భుతమైన నైపుణ్యం ఉంది.

డాన్‌బాస్‌లో పురోగతిపై గత మంగళవారం రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయగు హర్షం వ్యక్తం చేశారు. పౌరుల ప్రాణాలకు హాని జరగకూడదనే ఉద్దేశంతో తమ దళాలు మెల్లగా కదులుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో సుదీర్ఘ యుద్ధానికి రష్యా సిద్ధమైందనే సంకేతాలు ప్రపంచానికి ఇచ్చినట్లైంది.

సుదీర్ఘ యుద్ధంతో పశ్చిమ దేశాలకు ముప్పు..

ఐరోపాలో సుదీర్ఘ యుద్ధం మొదలైతే పశ్చిమ దేశాలు పూర్తిగా  అలసిపోవడమో.. లేక ఐకమత్యాన్ని కోల్పోవడమో ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం యుద్ధంలో ఎటువంటి ఫలితం వెలువడకపోవడంతో.. వచ్చే ఏడాది వరకూ ఇది కొనసాగే అవకాశం ఉంది. అమెరికా భౌగోళిక రాజకీయ దిగ్గజం హెన్రీ కిసెంజర్‌ దావోస్‌ సదస్సులో ఇటీవల మాట్లాడుతూ.. కొంత భూభాగం వదులుకొని శాంతికి సిద్ధమయ్యేలా.. రష్యాతో విభేదాలు లేని దేశాలు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. మరోవైపు డాన్‌బాస్‌లో విజయం కోసం ఉక్రెయిన్‌ లాంగ్‌ రేంజి ఎం270 మల్టిపుల్‌ రాకెట్‌ లాంఛర్లపై ఆశలు పెట్టుకొంది. దీనిపై అమెరికా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకూ నిర్ణయాన్ని వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని