Ukraine Crisis: ఉక్రెయిన్‌ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!

ఉక్రెయిన్‌ చేస్తోన్న ప్రతిదాడులతో రష్యాలోని వొరోనెజ్‌ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి (State of Emergency) విధించారు.

Updated : 07 Jul 2024 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌.. డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల చేసిన డ్రోన్ల దాడితో రష్యాలోని మందుగుండు గోదాముల్లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వొరోనెజ్‌ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి (State of Emergency) విధించారు. ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ఒక రోజు ముందు రష్యాలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా రష్యా కొంతకాలంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో సుమి ప్రావిన్సుపై ఇటీవల వైమానిక దాడులు చేసింది. దీంతో లక్షల మంది చీకట్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా సుమి ప్రావిన్సు రాజధానికి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రష్యాపై ప్రతిదాడులకు దిగిన ఉక్రెయిన్‌.. వొరోనెజ్‌ ప్రాంతంపై డ్రోన్లతో విరుచుకుపడింది. మందుగుండు సామగ్రి ఉన్న గోదాములో మంటలు చెలరేగాయి.

Stag beetle: ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!

ఈ దాడుల్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదని వొరోనెజ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ గుసేవ్‌ పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామన్నారు. అయితే, అక్కడ పేలుడు పదార్థాలు ఇంకా విస్ఫోటం చెందుతూనే ఉన్నాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ జులై 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు 22వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. సమకాలీన ప్రాంతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ అంశాలు కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. 2019 తర్వాత మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని