Wagner Group: బఖ్‌ముత్‌ పోరులో.. 20వేల ‘రష్యా ప్రైవేటు సైనికుల’ మృతి

ఉక్రెయిన్‌పై యుద్ధంలో భాగంగా బఖ్‌ముత్‌లో (Bakhmut) జరుగుతోన్న పోరులో 20వేలమందికి పైగా సైనికులను కోల్పోయినట్లు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు (Wagner Group) వెల్లడించింది.

Published : 25 May 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై (Ukraine Crisis) భీకర దాడులకు పాల్పడుతూ పలు నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్రంగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వీటిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ సేనలు .. రష్యా దాడులను అదేస్థాయిలో తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో కొన్నినెలలుగా బఖ్‌ముత్‌ (Bakhmut) నగరంలో భీకర పోరు సాగింది. ఇందులో రష్యా ప్రైవేటు సైన్యం దాదాపు 20వేల మందిని కోల్పోయినట్లు వాగ్నర్‌ గ్రూపు (Wagner Group) అధిపతి వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు నియమించుకున్న మొత్తం 50వేల మంది రష్యన్‌ ఖైదీలలో 20శాతం మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

‘ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణ లక్ష్యంతో రష్యా చేస్తున్న సైనిక చర్యను ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధ సహాయం, సైనిక శిక్షణతో ఉక్రెయిన్‌ సైన్యం బలంగా మారింది’ అని రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు (Bakhmut) అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ పేర్కొన్నారు. తాజాగా ఓ రష్యన్‌ వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. యుద్ధం సమయంలో ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల మద్దతుతో దూసుకెళ్తున్న ఉక్రెయిన్‌ సైన్యం ప్రతిదాడులకు సిద్ధమవుతోందని.. అవి మొదలైతే మాత్రం దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌తోపాటు ఇప్పటికే ఆక్రమించుకున్న క్రిమియా నుంచి రష్యా దళాలు వెళ్లిపోవచ్చని అంచనా వేశారు.

ఉక్రెయిన్‌లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్‌ సేన ఎప్పటికప్పుడు బహిరంగంగా తన అసంతృప్తిగా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తమకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రష్యా సైన్యం (Russia Military) ఇవ్వకపోవడంతో ఎంతో మందిని కోల్పోవాల్సి వస్తోందని పలుసార్లు ఆరోపించింది. ఒకానొక స్థాయిలో పైచేయి సాధిస్తున్న బఖ్‌ముత్‌ నగరం (Bakhmut) నుంచి వెనక్కి వచ్చేస్తామని రష్యా సైన్యాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తమ సైన్యాన్ని భారీగా కోల్పోయినట్టు వాగ్నర్‌ గ్రూపు వెల్లడించింది.

మరోవైపు బఖ్‌ముత్‌లో భారీ స్థాయిలో ప్రతిఘటన కొనసాగుతోందని.. అక్కడ ఇంకా పోరాటం ముగిసిపోలేదని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌ వెల్లడించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలను తరిమికొట్టేందుకు ఉక్రెయిన్‌ సైన్యం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌పై జరుపుతోన్న యుద్ధంలో కేవలం 6వేల మంది సైనికులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని రష్యా చెబుతోంది. అటు ఉక్రెయిన్‌ కూడా ఎంత మంది సైనికులను కోల్పోయిందనే విషయాన్ని వెల్లడించడం లేదు. కానీ, వాస్తవంగా ఈ సంఖ్య భారీ స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు