S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్‌

జీ20 సదస్సుకు సారథ్యం వహించడం సవాళ్లతో కూడుకొన్నదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) పేర్కొన్నారు. అదే విధంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు.

Published : 24 Sep 2023 12:21 IST

న్యూయార్క్‌: జీ20 సదస్సు (G20 sumitt)కు సారథ్యం వహించడంలో భారత్‌ ఎదుర్కొన్న సవాళ్లపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) మాట్లాడారు. న్యూయార్క్‌ (New York) వేదికగా జరిగిన ‘ఇండియా- యూఎన్‌ గ్లోబల్‌ సౌత్‌: డెలివరింగ్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌’(India-UN for Global South:Delivering for Development) సదస్సులో ఆయన పాల్గొన్నారు.

‘‘జీ20 సవాళ్లతో కూడుకున్న సదస్సు. దీనికి సారథ్యం వహించడమూ ఓ సవాలే. ఒకవైపు ప్రపంచం పేద, సంపన్న దేశాలుగా.. తూర్పు-పశ్చిమ ధ్రువాలు (రష్యా-పశ్చిమ దేశాలు)గా విడిపోతున్న సమయంలో భారత్‌ జీ20 సదస్సుకు సారథ్యం వహించింది. కొన్ని వారాల తర్వాతే మళ్లీ మనం ఇక్కడ భేటీ అవుతున్నాం. నేటి సదస్సుకు మీ రాక మాకు చాలా ముఖ్యం. భారత్‌ గురించి మీకున్న సెంటిమెంట్లను, సౌత్‌-సౌత్‌ (దక్షిణ భాగంలో ఉన్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల) సహకారం ప్రాముఖ్యాన్ని ఇది నొక్కి చెబుతోంది. ప్రపంచ అభివృద్ధి, పురోగతి అజెండాగా భారత్‌ జీ20 సదస్సుకు బాధ్యత వహించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పానికి భారత్‌ కట్టుబడి ఉంది’’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

‘భారత్‌-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’

ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉన్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు (సౌత్‌-సౌత్‌) ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన లేవనెత్తారు. జీ20 సదస్సులో భాగంగా ఎన్నో దేశాలతో భారత్‌ చర్చలు జరిపిందన్నారు. దీనిలో చాలా విషయాలు గమనించిన్నట్లు తెలిపారు. గ్లోబల్‌ సౌత్‌లో నిర్మాణాత్మక అసమానతలు, రాజకీయ పోటీలు, ఉద్రికత్తలు, సంఘర్షణలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వివాదాల కారణంగా దక్షిణ దేశాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. అంతేకాకుండా భౌగోళిక రాజకీయ సమీకరణలు, పోటీలు అనేక దేశాల్లో ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి ప్రాథమిక అవసరాలు తీరడంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా.. భారత్‌ తరఫున కేంద్రమంత్రి జైశంకర్‌ ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో  (UNGA) సెప్టెంబరు 26న ప్రసంగించనున్నారు. ఇందు కోసం ఆయన ఇప్పటికే న్యూయార్క్‌  చేరుకొన్నారు. అనంతరం ఆయన వాషింగ్టన్‌ డీసీని సందర్శించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని