S Jaishankar: కెనడాలో ఖలిస్థానీ అనుకూల ఘటనలు.. స్పందించిన జై శంకర్‌..!

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు సంస్థలను ఉద్దేశించి కేంద్రమంత్రి జై శంకర్ స్పందించారు. అలాగే తమ దేశీయుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అడ్వైజరీలు జారీ చేస్తామని చెప్పారు.

Published : 11 Oct 2022 01:19 IST

కాన్‌బెర్రా: ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛను మతోన్మాదానికి మద్దతు ఇచ్చే శక్తులు దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సోమవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటు సంస్థలను ఉద్దేశించి స్పందించారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు. 

‘ఈ అంశంపై ఎప్పటికప్పుడు కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛను మతోన్మాదానికి మద్దతు ఇచ్చే శక్తులు దుర్వినియోగం చేయకుండా చూడాల్సి ఉంది. ఇదే అంశాన్ని మేం కెనడా ప్రభుత్వం వద్ద లేవనెత్తాం. మన దేశంలోనే కాకుండా ఇతర దేశ ప్రజాస్వామ్యాల పనితీరు గురించి కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం’ అన్నారు. 

ఇటీవల కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ ‘సిఖ్స్‌ ఫర్ జస్టిస్‌’ ఆధ్వర్యంలో ఖలిస్థాన్‌ ఏర్పాటుపై రెఫరెండం నిర్వహించారు. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత దేశ వ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు అక్కడి ఓ ఆలయంపైనా దాడి జరిగింది. ఈ విధమైన వరుస ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం.. అక్కడి భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో విద్వేషపూరిత ఘటనలు(Hate crimes), మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది.

అందుకు ప్రతిగా కెనడా.. భారత్‌లో ఆ రాష్ట్రాల్లో జాగ్రత్త అంటూ ఓ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘అనూహ్య భద్రతా పరిస్థితి, మందుపాతరలు, పేలని ఆయుధాల ఉనికి కారణంగా..  గుజరాత్, పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటనకు ప్రజలు దూరంగా ఉండండి’ అని దానిలో పేర్కొంది.  

తాజాగా దీనిపై జై శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘మేం మా ప్రజల భద్రతను ఉద్దేశించి అడ్వైజరీలను జారీ చేస్తాం. వాటిలో అంతకు మించి ఇంకేం వెతకొద్దని నేను కోరుతున్నాను. అలాగే ఇతర దేశాలు కూడా వారి విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి’ అని మంత్రి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని