Salman Rushdie: మాట్లాడుతున్న రష్దీ.. వెంటిలేటర్‌ తొలగించిన వైద్యులు!

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బుకర్‌ ప్రైజ్‌ విజేత, ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు ఆయన సన్నిహితుడు ఆండ్రూ వైలీ తెలిపారు....

Published : 14 Aug 2022 11:43 IST

వాషింగ్టన్‌: దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బుకర్‌ ప్రైజ్‌ విజేత, ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు ఆయన సన్నిహితుడు ఆండ్రూ వైలీ తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌ తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడుతున్నారని వెల్లడించారు. అయితే, విషమ పరిస్థితుల నుంచి ఇంకా బయటపడలేదని.. వైద్యుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

రష్దీపై జరిగిన దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని ఆయన భయానకమైందిగా పేర్కొన్నారు.‘‘మానవత్వంపై ఆయన అంతర్‌దృష్టి; కథలో ఆయన అసమానమైన భావం; భయపడడానికి లేదా నిశ్శబ్దంగా ఉండటానికి నిరాకరించడం.. సల్మాన్‌ రష్దీలో ఉండే ఈ లక్షణాలు సార్వత్రిక ఆదర్శాలను సూచిస్తాయి. ఆయనలో ఉన్న నిజం, ధైర్యం, భయం లేకుండా ఆలోచనలను పంచుకునే సామర్థ్యం.. ఇవి స్వేచ్ఛా సమాజానికి నిర్మాణ వస్తువులు. ఈ అమెరికన్ విలువల రక్షణను మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. రష్దీతో పాటు భావప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడే వారందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం’’ అని బైడెన్‌ అన్నారు.

న్యూయార్క్‌లో సాహిత్య సంబంధిత ఒక కార్యక్రమానికి హాజరైన రష్దీపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ నివాసి హాది మతార్‌ (24) ఆయనపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డారు. కత్తిపోట్లతో అధికంగా రక్తం కోల్పోయిన రష్దీని ఘటనాస్థలి నుంచి పెన్సిల్వేనియాలోని ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించి, కొన్ని గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన చాలాఏళ్లుగా ప్రాణహాని ముప్పును ఎదుర్కొంటూ వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు