China: చైనా ఎడారిలో ఆపరేషన్‌ తైవాన్‌కు పదును..!

ప్రపంచం మొత్తం ఉక్రెయిన్‌ యుద్ధం వైపు చూస్తుండగా.. చైనా మాత్రం మెల్లగా తైవాన్‌ ఆక్రమణకు అవసరమైన వ్యూహాలను సాధన చేస్తోంది. తైవాన్‌కు అండగా నిలిచే ప్రధాన దేశాలైన అమెరికా,

Updated : 23 May 2022 12:41 IST

 తైవాన్‌ ఆక్రమణ సమయంలో జపాన్‌, అమెరికాను అడ్డుకొనేందుకు సాధన

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచం మొత్తం ఉక్రెయిన్‌ యుద్ధం వైపు చూస్తుండగా.. చైనా మాత్రం మెల్లిగా తైవాన్‌ ఆక్రమణకు అవసరమైన వ్యూహాలకు పదను పెడుతోంది. తైవాన్‌కు అండగా నిలిచే ప్రధాన దేశాలైన అమెరికా, జపాన్‌లను దెబ్బతీయడంపై దృష్టిపెట్టింది. ఈ విషయం ఇటీవల ప్లానెట్‌ ల్యాబ్‌ అనే ఓ సంస్థ చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. ఓ వైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో పశ్చిమ దేశాలు, అమెరికా తలమునకలై ఉన్నప్పుడు డ్రాగన్‌ ఈ రకమైన యుద్ధ విన్యాసాలు చేయడం ఆందోళనకరంగా మారింది.

ఏం జరిగింది..?

చైనాలో షింజియాంగ్‌లోని ఓ ఎడారి ప్రాంతంలో జపాన్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌ బార్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (అవాక్స్‌) తరహా నిర్మాణం చేపట్టడం సంచలనం సృష్టించింది. దీని డిజైన్‌ బోయింగ్‌ ఈ-767 తరహాలో ఉంది. రెండు ఇంజిన్లు ఉన్న ఈ తరహా విమానాలను కేవలం జపాన్‌ దళాలు మాత్రమే వినియోగిస్తున్నాయని  సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ నిపుణులు థామస్‌ నిక్కీ ఏషియాకు వెల్లడించారు. ప్రస్తుతం టోక్యో వద్ద నాలుగు విమానాలు ఉన్నాయి. తైవాన్‌ ఆక్రమణ కోసం ప్రణాళికలను తయారు చేయడానికే జపాన్‌ అవాక్సుల కట్టడిపై సాధన చేస్తున్నట్లు భావిస్తున్నారు. తైవాన్‌లో సంక్షోభం తలెత్తిన సమయంలో ఈ విమానాలను కోల్పోతే నాన్సే దీవులపై నిఘా సాధ్యంకాదని జపాన్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ కియోఫుమి ఐవాత తెలిపారు. 

 ఈ విమానాలను కూల్చగలదా..?

రణ క్షేత్రానికి సుదూరాల్లో ఉంటూనే ఈ విమానాలు..  అక్కడ ప్రత్యర్థి దళాల కదలికలను గుర్తించగలవు. హైఆల్టిట్యూడ్‌లో ‘ఈ-767’ విమానాలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో 9,000 కిలోటమీర్లు ప్రయాణించగలవు. ఈ రకం విమానాలను ఆకాశానికి కంట్రోల్‌ టవర్లుగా అభివర్ణిస్తుంటారు. ఈ విమానంపై డిస్క్‌ తరహా ఓ రాడార్‌ అమర్చి ఉంటుంది. సాధారణంగా భూమి పై ఉండే రాడార్ల కంటే.. అత్యధిక ఎత్తులో ఉండే ఈ రాడార్లు సుదూరాలపై నిఘా ఉంచగలవు.  శత్రుదేశాల విమానాలు, క్షిపణుల రాకను సూదూరం నుంచే గుర్తించి వాటిని అడ్డుకొనేందుకు స్వదేశీ ఫైటర్‌ జెట్లకు మార్గదర్శకత్వం చేస్తాయి. ఈ-767 విమానాలను బోయింగ్‌ అభివృద్ధి చేసింది.  50 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 16 మీటర్ల ఎత్తుతో  ఉంటాయి. ప్రపంచంలో జపాన్‌ మాత్రమే ఈ తరహా విమానాలను హమామట్సు ఎయిర్‌ బేస్‌లో వాడుతోంది.

ఈ విమానాలు గగనతలంలో ఉన్నప్పుడు కూల్చడం అంత తేలిక కాదు. కానీ, విమానం నేలపై నిలిపిన సమయంలో చాలా తేలిగ్గా దాడి చేయవచ్చు. బహుశ చైనా ఆ వ్యూహాన్నే సాధన చేస్తోందని మరో సైనిక నిపుణుడు వెల్లడించారు. క్షిపణి కచ్చితత్వాన్ని పరీక్షించడానికి నిలిపిన విమానం చుట్టూ మరికొన్ని వాహనాలను ఉంచారన్నారు.

జపాన్‌,అమెరికాలకు భయపెట్టేందుకు తాటాకు చప్పుళ్లు..

ఇటీవల చైనా.. అమెరికా ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌, డెస్ట్రాయర్‌ తరహా నిర్మాణం ఒకటి చేపట్టి.. దానిపై ఆయుధ పరీక్షలను నిర్వహించింది. ఇప్పుడు జపాన్‌ అవాక్స్‌ల కదలికలపై సాధన చేయడం దీనికి బలాన్నిస్తోంది. అమెరికా, జపాన్‌ దేశాలు వీటి ఉపగ్రహ చిత్రాలను తీస్తాయని చైనాకు తెలుసు. కానీ, చైనాతో తలపడితే ఏం జరుగుతుందో ఆ రెండు దేశాలకు తెలియజెప్పేందుకు ఇలా చేస్తోంది. అంతేకాదు.. తైవాన్‌కు చెందిన సువో నావికాదళ స్థావరాన్ని పోలిన కృత్రిమ నిర్మాణం కూడా చైనా చేపట్టింది. చైనా ఆక్రమణను అడ్డుకొనేందుకు ఈ స్థావరం తైవాన్‌కు అత్యంత కీలకమైంది.

చైనా అధినేతగా మూడోసారి షీజిన్‌పింగ్‌ బాధ్యతలు స్వీకరించాక తైవాన్‌ విలీనంపై దృష్టిపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికపై చైనా వ్యూహకర్తలు పనిచేస్తున్నారు. అదే సమయంలో శాంతియుతంగా ఈ విలీనం సాధ్యంకాకపోతే.. సైనిక శక్తిని వాడే అంశాన్ని చైనా కొట్టపారేయలేదు. 

మేము తైవాన్‌ను కాపాడుతాం..: జోబైడెన్‌

చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే తాము తైవాన్‌ సైన్యాన్ని రక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సోమవారం టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తేల్చి చెప్పారు. తైవాన్‌ ఆక్రమణ అనేది ప్రమాదంతో చెలగాటమాడటమేనని ఆయన అభివర్ణించారు. వన్‌ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉంది.. దానిపై సంతకం చేసిందని బైడెన్‌ గుర్తు చేశారు. అలాగని తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవడం సరికాదని హెచ్చరించారు.  తైవాన్‌కు రక్షణ విషయంలో ఆయన చాలా స్థిరంగా అమెరికా మద్దతు ఇస్తుందని చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని