oil output: సౌదీ నుంచి బైడెన్‌కు మరో షాక్‌..!

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయని సామెత ఉంది. కొన్ని నెలల క్రితం వరకు హుతి రెబల్స్‌ దాడి చేస్తున్నారు ఆయుధాలు ఇవ్వాలని సౌదీ అమెరికాకు విజ్ఞప్తి చేసింది.. కానీ, అమెరికా ఏవో సాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది..! కాలం మారింది.. చమురు సంక్షోభం భగ్గుమంది

Published : 05 Aug 2022 01:33 IST

 అతితక్కువ చమురు ఉత్పత్తి పెంపు

ఇంటర్నెట్‌డెస్క్‌ప్రత్యేకం

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయని సామెత ఉంది. కొన్ని నెలల క్రితం వరకూ హుతి రెబల్స్‌ దాడి చేస్తున్నారు.. ఆయుధాలు ఇవ్వాలని సౌదీ అమెరికాకు విజ్ఞప్తి చేసింది.. కానీ, అమెరికా ఏవో సాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది..! కాలం మారింది.. చమురు సంక్షోభం భగ్గుమంది. దీంతో ఇంధన ఉత్పత్తి పెంచాలని అమెరికా సౌదీని కోరింది. దీనికి అంగీకరించి పెంచింది.. దాదాపు 40 ఏళ్ల అతితక్కువ పెంపు అదే కావడం అమెరికాను షాక్‌కు గురి చేసింది.    

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టడం ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభానికి ఆజ్యం పోసింది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పతాక స్థాయిలో 9శాతాన్ని దాటేసింది. మరికొన్నాళ్లలో అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికలు ఉండటంతో బైడెన్‌ సర్కారులో కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తి పెంచడం దాని లక్ష్యంగా మారింది. కానీ, రష్యా బైడెన్‌ మాట వినదు.. ఇక కొద్దో గొప్పో వినేది సౌదీనే. ఈ నేపథ్యంలో ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన బైడెన్‌ చమురు ఉత్పత్తి పెంచడంపై అక్కడి యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించారు. 

86 సెకన్లకు సరిపడా చమురు ఉత్పత్తి పెంపు..?

అప్పటి వరకు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) పాలనలోని సౌదీని బైడెన్‌ కార్యవర్గం దూరం పెట్టింది. కానీ, చమురు కోసం ఒక్కసారిగా దగ్గరయ్యేందుకు చేసిన యత్నం పెద్దగా ఫలితం చూపించలేదు. సౌదీ నేతృత్వంలోని ఒపెక్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌) బృందం కేవలం రోజుకు 1,00,000 పీపాల చమురు ఉత్పత్తి మాత్రమే పెంచాలని నిర్ణయించింది. ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో ఇది కేవలం 86 సెకన్ల డిమాండ్‌ను మాత్రమే తీర్చగలదని సీఎన్‌బీసీ కథనంలో పేర్కొంది. బైడెన్‌ కార్యవర్గానికి ఇదో పెద్దషాక్‌. అమెరికాలోనే 2021 లెక్కల ప్రకారం రోజువారీ చమురు వినియోగం 19.78 మిలియన్‌ పీపాలుగా ఉందంటే.. తాజా పెంపు ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. 1986 నుంచి అతి తక్కువ చమురు ఉత్పత్తి పెంపుగా ఇది నిలిచిందని వాషింగ్టన్‌కు చెందిన కన్సల్టెంట్‌ గ్రూప్‌ ర్యాపిడాన్‌ ఎనర్జీ అధ్యక్షుడు బాబ్‌ మెక్‌నల్లీ పేర్కొన్నారు.  వాస్తవానికి జులై, ఆగస్టు నెలల్లో రోజుకు 6,48,000 పీపాల చమురు ఉత్పత్తి పెంచుతామని జూన్‌లో ఒపెక్‌ పేర్కొంది. తాజా పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని శ్వేతసౌధం కూడా పేర్కొంది. 

ఒపెక్‌ నిర్ణయాన్ని అమెరికా పత్రికలు బైడెన్‌ వైఫల్యంగా పేర్కొంటున్నాయి. ‘బైడెన్‌ కార్యవర్గానికి ఇదో చెంపపెట్టు’ అని సీఎన్‌ఎన్‌  విశ్లేషకుడు మాట్‌ స్మిత్‌ పేర్కొన్నట్లు న్యూయార్క్‌ పోస్టు కథనం వెల్లడించింది. 

ఒపెక్‌ భేటీకి గంటల ముందే తాయిలాలు ఇచ్చినా..

ఒపెక్‌ దేశాల సమావేశానికి కొద్ది గంటల ముందే బైడెన్‌ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకొంది. సౌదీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు కొన్ని నెలల నుంచి నిలిపివేసిన ఆయుధ విక్రయాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌ ప్రకారం 5 బిలియన్‌ డాలర్లు విలువైన క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇతర పరికరాలు ఉన్నాయి. సౌదీలోని కీలక స్థావరాలను హుతి రాకెట్ల నుంచి కాపాడేందుకు వీలుగా 3 బిలియన్‌ డాలర్ల విలువైన పేట్రియాట్‌ క్షిపణులు, యూఏఈకి 2.2 బిలియన్‌ డాలర్లు విలువైన హైఆల్టిట్యూడ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థను అందజేయనుంది. అత్యాధునిక థాడ్‌(థర్మల్‌ హైఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌) గగనతల రక్షణ వ్యవస్థను విక్రయించనుంది. ఈ సందర్భంగా అమెరికా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా ‘‘అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించడానికి, మిత్ర దేశానికి రక్షణ కల్పించడం ద్వారా అమెరికా భద్రతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విక్రయాలు గల్ఫ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి’’ అని పేర్కొన్నారు.

సౌదీ ఆయుధం చమురే..

సౌదీ అరేబియా చమురును అగ్రదేశాలపై ఆయుధంగా వాడటం ఇదేమీ కొత్త కాదు. 2020లో సౌదీ-రష్యా మధ్య చమురు ధరలపై విభేదాలు తలెత్తాయి. మార్చి నుంచి సౌదీ భారీ డిస్కౌంట్‌పై చమురును అమ్మడం మొదలు పెట్టింది. ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచింది. దీంతో గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంతగా ధరలు పతనం అయ్యాయి. ఏప్రిల్‌ మూడో వారంలో ఒక దశలో చమురు ధరలు నెగిటివ్‌కు వెళ్లిపోయాయి. దీనికి కొవిడ్‌ వ్యాప్తితో డిమాండ్‌ పతనం తోడైంది. రష్యా రూబుల్‌ ఈ దెబ్బకు భారీగా విలువ కోల్పోయింది. ఆ తర్వాత ఒపెక్‌ జోక్యంతో మళ్లీ ఇరు దేశాలు రాజీకి వచ్చి చమురు ఉత్పత్తిలో కోతలు విధించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని