World Bank: కరోనా వేళ స్కూళ్ల మూసివేతను సమర్థించలేం..!

పాఠశాలలను మూసివేయడాన్ని సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌ జేమీ సావెద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న.......

Published : 17 Jan 2022 01:44 IST

పేర్కొన్న ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై కోలుకోలేని దెబ్బకొట్టింది. కొవిడ్‌ కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. పలు దేశాల్లో ఇంకా విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే పాఠశాలలను మూసివేయడాన్ని సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్‌ జేమీ సావెద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ఆయన.. కొత్త వేరియంట్లు వస్తే తప్పని పరిస్థితుల్లో మాత్రమే చివరి నిర్ణయంగా స్కూళ్ల మూసివేతను చేపట్టాలని సూచించారు.

పాఠశాలలు సురక్షితం కాదని, తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని సావెద్రా అన్నారు. బడులు తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పబ్లిక్ పాలసీ కోణంలో పిల్లలకు టీకాలు వేసేంత వరకు వేచి ఉండటం సమంజసం కాదని, దాని వెనుక ఎలాంటి శాస్త్రీయ కోణం లేదని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ‘బార్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాళ్లను తెరిచి.. పాఠశాలలను మూసివేయడంలో ఎలాంటి అర్థం లేదు. ఇలాంటి విషయాలను క్షమించలేము. బడులను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని పలు అధ్యయనాల్లో తేలింది. పిల్లలపై వైరస్‌ ప్రభావం కూడా తక్కువేనని వెల్లడైంది’ అని  జేమీ సావెద్రా పేర్కొన్నారు.

2020కు సంబంధించి ‘బీటెన్ లేదా బ్రోకెన్? ఇన్‌ఫార్మాలిటీ, దక్షిణాసియాలో కరోనా’ పేరుతో ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం​ ఓ నివేదికను రూపొందించింది. ఒక దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మించి నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. స్కూళ్ల మూసివేత కారణంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సావెద్రా హెచ్చరించారు. పాఠశాలలు తెరుచుకోవడం వల్ల కేసులేమైనా పెరిగాయా? అనే విషయంపై అధ్యయనం చేపట్టగా అలా జరగలేదని తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని