Russia: 48వేల సంవత్సరాలనాటి వైరస్‌ను వెలికి తీసిన శాస్త్రవేత్తలు

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్‌  సరస్సులో కొన్ని వేల ఏళ్లుగా గడ్డకట్టుకుపోయి ఉన్న మంచు నుంచి కొన్ని వైరస్‌ నమూనాలను ఐరోపా శాస్త్రవేత్తలు వెలికి తీశారు.

Published : 30 Nov 2022 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు 48,500 సంవత్సరాలుగా మంచు కిందే ఉండిపోయిన అరుదైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్‌ సరస్సులో కొన్ని వేల ఏళ్లుగా గడ్డకట్టుకుపోయి ఉన్న మంచు నుంచి కొన్ని వైరస్‌ నమూనాలను ఐరోపా శాస్త్రవేత్తలు వెలికి తీశారు. వీటిని 13 రకాల సూక్ష్మజీవులుగా వర్గీకరించారు. వీటికి ‘జాంబీ వైరస్‌’ అని పేరుపెట్టారు. వేల ఏళ్లుగా ఇవి మంచులో కప్పిపెట్టి ఉన్నా.. మరో జీవికి సోకే స్థితిలోనే ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో పాండోరావైరస్‌ ఎడోమాగా పిలిచే సూక్ష్మజీవి అత్యధికంగా 48,500 ఏళ్లనాటిదని నిర్ధారించారు. 2013లో ఇదే బృందం దాదాపు 30,000 ఏళ్లనాటి వైరస్‌ను గుర్తించింది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌ హౌస్‌ వాయువుల కారణంగా పురాతన హిమఖండాలు కరిగిపోవడంపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాటి కింద నిద్రాణంగా ఉన్న సూక్ష్మజీవులపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదని పేర్కొంటున్నారు.

రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము లక్ష్యంగా చేసుకొన్న ఈ వైరస్‌ల వల్ల జీవసంబంధమైన ముప్పులు ఏర్పడే అవకాశాలపై ఆందోళన అక్కర్లేదని పేర్కొన్నారు. అవి అమీబా శ్రేణి సూక్ష్మజీవులకు మాత్రమే సోకగలవని పేర్కొన్నారు.  జంతువులు, మనుషులు, మొక్కలకు సోకగల వైరస్‌ పునరుజ్జీవం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని ఆ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు