Scotland: 48ఏళ్ల పోరాట ఫలితం.. తల్లి చెంతకు కుమారుడి అవశేషాలు..

పుట్టిన వారం రోజులకే ఆ శిశువు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ శిశువు అధికారులు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడంపై తల్లి అనుమానం వ్యక్తం చేసింది. చివరకు ఆమె అనుమానం నిజమవడంతో ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 18 Mar 2023 01:56 IST

లండన్‌: అనారోగ్యంతో పుట్టిన ఓ మగ శిశువు (Infant).. వారానికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కన్నీరుమున్నీరైన ఆ మాతృమూర్తి చిన్నారిని కడసారిగా  చూసుకోలేకపోయింది. అంత్యక్రియలు పూర్తి చేశామని అధికారులు చెప్పినప్పటికీ శంకించిన ఆమె.. కుమారుడి అవశేషాల కోసం పట్టుపట్టింది. చివరకు 48 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఆ చిన్నారి అవశేషాలను స్వాధీనం చేసుకోగలిగింది. స్కాట్లాండ్ (Scotland) మాతృమూర్తికి ఈ విషాద సంఘటన ఎదురైంది.

స్కాట్లాండ్‌కు చెందిన లైదియా రీడ్‌ (78) అనే మహిళ 1975లో ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ, పుట్టిన వారం రోజులకే ఆ శిశువు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ తల్లికి చెప్పిన అధికారులు.. అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. అంత్యక్రియలు హడావిడిగా చేయడంపై అనుమానం వ్యక్తంచేసిన ఆమెకు.. పరిశోధన కోసం తన కుమారుడి అవయవాలు తీసుకున్నారనే భయాందోళన ఎక్కువైంది. చివరకు అదే నిజమని తేలడంతో ఆ కన్నతల్లి మరింత కంగారు పడింది.

దీంతో తన బిడ్డ అవశేషాలు చూపెట్టాలని అధికారులను డిమాండ్‌ చేసింది. ఆమె ఒత్తిడితో అధికారులు మరో బిడ్డను చూపెట్టడంతో ఆమె అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. ఇదే సమయంలో తాను అనారోగ్యానికి గురైనా.. పట్టు విడవకుండా వాటి కోసం అన్ని మార్గాల్లో సుదీర్ఘ పోరాటం కొనసాగించింది. ఈ క్రమంలో 2017లో కొంత ఊరట కలిగింది. కోర్టు అనుమతితో తన కుమారుడిదేనని అధికారులు చెప్పిన శవపేటికను బయటకు తీయించి చూడగా.. అందులో అసలు ఎలాంటి అవశేషాలూ లేకపోవడంతో కన్నపేగు కంగుతింది.

తన కుమారుడికి ఎలాగైనా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేపట్టాలన్న ఆమె తలంపునకు వ్యవస్థలు దిగివచ్చాయి. కుమారుడి అవశేషాల కోసం 48ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఆమెకు.. కుమారుడి అవశేషాలు అందించేందుకు క్రౌన్‌ ఆఫీస్‌ అధికారులు అంగీకరించారు. ఎడిన్‌బర్గ్‌లోని రాయల్‌ వయోవృద్ధుల పునరావాస వైద్యశాలలో భద్రపరిచిన ఆ శిశువు అవయవాలు, కొన్ని అవశేషాలను ఆ తల్లికి అందించడంతో ఆమె పోరాటం ఫలించినట్లయ్యింది. మరికొన్ని అవశేషాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని సమాచారం.

అయితే, పరిశోధన కోసం చిన్నారుల అవయవాలను స్కాట్లాండ్‌ ఆస్పత్రుల్లో భద్రపరిచడం ఎంతో కాలంగా సాగుతోందనే విషయం తాజా ఘటనతో మరోసారి రుజువయ్యింది. మీడియా కథనాల ప్రకారం, 1970-2000 మధ్యకాలంలో అక్కడి ఆస్పత్రుల్లో సుమారు 6వేల అవయవాలు, కణజాలాలను భద్రపరిచారని వెల్లడైంది. దీనిపై దర్యాప్తు జరిపిన నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌.. చివరకు వాస్తవాలను అంగీకరించాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని