Pakistan: ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌.. చివరి నిమిషంలో ప్రతిపక్షాలు మరో ట్విస్ట్‌

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై కీలకమైన అవిశ్వాస తీర్మానం మరికాసేపట్లో పార్లమెంటు ముందు ఓటింగుకు రానుంది....

Updated : 03 Apr 2022 12:05 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై కీలకమైన అవిశ్వాస తీర్మానం మరికాసేపట్లో పార్లమెంటు ముందు ఓటింగుకు రానుంది. దాదాపు నెల రోజులుగా ఇమ్రాన్‌ వర్సెస్‌ ప్రతిపక్షాలు మధ్య సాగుతోన్న మాటల యుద్ధం ముగింపు దశకు వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వ సారథిగా 2018 ఆగస్టులో పాక్‌ పాలనాపగ్గాలు చేపట్టిన ఈ మాజీ క్రికెటర్‌ భవితవ్యం కొద్దిసేపట్లో తేలనుంది. పాకిస్థాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు నేషనల్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే నేషనల్‌ అసెంబ్లీకి చేరుకుంటున్నారు. మరోవైపు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇస్లామాబాద్‌ నగరంలో ప్రభుత్వం సెక్షన్‌ 144 విధించింది. రెడ్‌ జోన్‌ ఏరియాలో ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించొద్దని ఇస్లామాబాద్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నలుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు చివరి నిమిషంలో ఇమ్రాన్‌కు ప్రతిపక్షాలు మరో ట్విస్ట్‌ను ఇచ్చాయి. నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌ అసర్‌ ఖైసర్‌పైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈరోజు సమావేశాలు ఎలా సాగనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తాము దేశద్రోహం, అసత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. తన మద్దతుదారులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇమ్రాన్‌ ప్రభత్వాన్ని ఏ శక్తీ కాపాడలేదని ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ ధీమా వ్యక్తం చేశారు. అక్కడి రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. నేటి ఓటింగ్‌లో ఇమ్రాన్‌ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలకు 177 మంది సభ్యుల బలం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఇమ్రాన్‌కు 172 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. కానీ, సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే కొన్ని పార్టీలు వైదొలగగా.. ఇమ్రాన్‌ సొంత పార్టీ నుంచి కూడా కొంత మంది ఆయనకు మద్దతు తెలిపేది లేదని తేల్చి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని