Pakistan: పాకిస్థాన్‌ మంత్రిని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంత్రిని కిడ్నాప్‌ చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని అపహరించారు. డిమాండ్లకు అధికారులు అంగీకరించడంతో వారిని విడిచిపెట్టారు.

Published : 09 Oct 2022 01:38 IST

లాహోర్: పాకిస్థాన్‌కు చెందిన సీనియర్‌ మంత్రి అబైదుల్లా బైగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. మంత్రితోపాటు మరో ఇద్దరిని తీవ్రవాదులు శుక్రవారం ఎత్తుకెళ్లగా.. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, డిమాండ్లను అంగీకరించడంతో ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడుదల చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.  మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అబైదుల్లా మంత్రిగా ఉన్నారు. కాగా, ఉత్తర పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో మంత్రితోపాటు ఇద్దరు పర్యాటకులను తెహ్రీక్-ఇ-తాలిబాన్ చెందిన తీవ్రవాదులు శుక్రవారం మధ్యాహ్నం అపహరించారు.

జైల్లో ఉన్న తమ గ్రూప్‌ సభ్యులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా విడుదల చేశారు. కాగా, అధికారులు ఆ డిమాండ్లకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమై, డిమాండ్లకు ఒప్పుకోవడంతో బంధీలుగా ఉన్న ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడిచిపెట్టినట్లు అక్కడి వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

నంగా పర్బత్‌, దియామేర్‌ ప్రాంతాల్లో విదేశీయులను ఊచకోత కోసిన ఉగ్రవాదులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వారిని విడుదల చేయాలని హెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ కమాండర్‌, మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హబీబుర్‌ రహమాన్‌ డిమాండ్‌ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహిళా క్రీడా కార్యకలాపాలు లేకుండా చట్టాలు రూపొందించాలని కూడా అందులో డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని